విధ్వంసానికి పాల్పడిన వారిలో 19 మంది అరెస్టు

అమలాపురంలో మంగళవారం జరిగిన విధ్వంస ఘటనలకు పాల్పడినవారిలో గురువారం 19 మందిని అరెస్టు చేశామని, వీరిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు వెల్లడించారు. శుక్రవారం మరికొంతమందిని

Published : 27 May 2022 05:39 IST

 ఆందోళనకారులను రాజకీయకోణంలో చూడట్లేదు

ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు

అమలాపురం పట్టణం, పి.గన్నవరం, న్యూస్‌టుడే: అమలాపురంలో మంగళవారం జరిగిన విధ్వంస ఘటనలకు పాల్పడినవారిలో గురువారం 19 మందిని అరెస్టు చేశామని, వీరిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు వెల్లడించారు. శుక్రవారం మరికొంతమందిని అరెస్టు చేస్తామన్నారు. గురువారం రాత్రి ఆయన కోనసీమ, కాకినాడ జిల్లాల ఎస్పీలు సుబ్బారెడ్డి, రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ జిల్లా ఏఎస్పీ లతామాధురితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘నిరసనకారులు 20 వాట్సప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపుకొని అమలాపురంలో కలశం వద్దకు చేరారు. చివరగా భట్నవిల్లిలో మంత్రి విశ్వరూప్‌ సొంత ఇంటిని దగ్ధం చేసేవరకూ వీరి పాత్ర ఉంది. ఈ ఘటనకు సంబంధించి 19 మందిపై  కేసులు నమోదుచేశాం. అరెస్టుచేసిన వారిపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. బృందాలుగా విడిపోయి వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు వెంబడిస్తూ నల్లవంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆందోళనకారులు వజ్ర వాహనంపై దాడి, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి విధ్వంసాలకు పాల్పడ్డారు. వారిలో మరో బృందం కలెక్టరేట్‌ వద్దకు వెళ్లి అక్కడ ప్రైవేటు బస్సును దహనం చేసింది. అక్కడి నుంచి ఆరు వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారం పంపుకొని మంత్రి ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఎర్రవంతెన వద్ద రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు. అనంతరం మూకుమ్మడిగా ఎస్‌బీఐ కాలనీలో మంత్రి విశ్వరూప్‌ అద్దె ఇంటికి వెళ్లి నిప్పుపెట్టారు. తర్వాత ఒక బృందం హౌసింగ్‌బోర్డు కాలనీలో ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇంటికి నిప్పుపెట్టింది. మరో బృందం భట్నవిల్లిలోని నిర్మాణంలో ఉన్న మంత్రికి చెందిన సొంత ఇంటికి చేరుకుని దానికీ నిప్పు పెట్టింది. విధ్వంసకారులను రాజకీయ కోణంలో చూడట్లేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు, నిఘా వైఫల్యంపై ఆత్మావలోకనం చేసుకుంటున్నాం. విధ్వంసకారులను గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారం అంతటినీ సద్వినియోగం చేసుకుంటున్నాం. వారిని గుర్తించేందుకు ఆరు బృందాలను నియమించాం. వీరు కాకుండా ఆరు పికప్‌ పార్టీలు ఈ కేసులో పనిచేస్తున్నాయి’ అన్నారు. ఈ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ సేవలను క్రమంగా పునరుద్ధరిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని