Updated : 28 May 2022 06:57 IST

యుగ పురుషుడు

రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ఎన్టీఆర్‌
ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేసిన నేత
సమాజహితమే ధ్యేయంగా సంచలన నిర్ణయాలు
పాలనా సంస్కరణలకు ఆద్యుడు..
నేడు ఆయన 99వ జయంతి

ఎన్టీఆర్‌.. ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది.

ప్రజాసేవలో ఆయన ప్రతి అడుగూ.. సమాజశ్రేయస్సు కోసం చేపట్టిన ప్రతిసంస్కరణా నేటి తరానికి మార్గదర్శకమై నిలుస్తుంది.

సినీ వినీలాకాశంలో ధ్రువతారగా, రాజకీయ యవనికపై విజయానికి చిరునామాగా మారిన నందమూరి తారకరాముడి ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ సంచలనం. ఉక్కు మహిళ ఇందిరాగాంధీనే గుక్కతిప్పుకోకుండా చేసి, దశాబ్దాల కాంగ్రెస్‌ గుత్తాధిపత్యాన్ని కూకటివేళ్లతో పెకిలించిన నాయకుడిగా ఆయన ప్రజాప్రస్థానం అనితర సాధ్యం. ఆరు పదుల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి, అధికారంలోకి రావడమే విశేషమైతే.. ఏడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఓ అసాధారణ సంస్కరణే. రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజా నాయకుడాయన. రాజకీయాలంటే వ్యాపారం కాదని.. పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని చాటిన అభ్యుదయవాది. ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చినా, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పంచినా, సగం ధరకే జనతా వస్త్రాలు అందించినా, పక్కా ఇళ్లు కట్టించినా, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయాల్లోనూ ఉన్నత స్థానాలు కల్పించినా ఆయనకు ఆయనే సాటి. పేదలకు కూడు, నీడ, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచీ వాటిని అమలు చేసేందుకు కంకణం కట్టుకున్న పేదల పక్షపాతి. తెలుగువారంతా నోరారా అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్‌ 99వ పుట్టిన రోజు నేడు. 

ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నీ భూస్వాములు, మోతుబరులు, కొన్ని సామాజికవర్గాల చేతుల్లోనే ఉండేవి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప మిగతా స్థానాల్లో దాదాపుగా వారే పోటీ చేసేవారు. వెనుకబడిన వర్గాలకూ నామమాత్రపు ప్రాధాన్యమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీదే గుత్తాధిపత్యం. అడుగడుగునా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతమే. దిల్లీ నుంచే ఇక్కడి ముఖ్యమంత్రుల్ని ఆటబొమ్మల్లా ఆడించేవారు. ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక ఇది మరింత ప్రబలింది. ముఖ్యమంత్రుల్ని పదేపదే మార్చడంతో రాజకీయ అస్థిరత నెలకొనేది. కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయమే లేదనుకున్న దశలో... రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీఆర్‌.. ఆ పార్టీని తొమ్మిది నెలల్లోనే మట్టి కరిపించారు. రాజ్‌భవన్‌లో కొద్ది మంది ఆహూతుల సమక్షంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేసే పద్ధతినీ ఎన్టీఆరే మార్చారు. లాల్‌బహదూర్‌ స్టేడియంలో జనవాహిని మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ముఖ్యమంత్రులు ఎక్కువ శాఖల్ని తమ వద్దే అట్టేపెట్టుకునేవారు. ఎన్టీఆర్‌ ఎక్కువ శాఖలను మంత్రులకే కేటాయించారు. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి,  క్షుణ్నంగా చర్చించేవారు. 1983 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక.. రాజకీయాల్ని సమూలంగా ప్రక్షాళించేందుకు కంకణం కట్టుకున్నారు. ఎమ్మెల్యేలకు ప్రవర్తన నియమావళి జారీ చేశారు. వారు ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, ఉద్యోగులు బదిలీలు, నియామకాల్లో జోక్యం చేసుకోకూడదని, అవినీతి నిర్మూలనకు సహకరించాలని పేర్కొన్నారు. 

పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన

దేశంలో ఆర్థిక సంస్కరణలకు చాలా ముందే ఎన్టీఆర్‌ స్వేచ్ఛావాణిజ్యాన్ని నమ్మారు. ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు 1984లో వాణిజ్య, పారిశ్రామికవేత్తల బృందాన్ని తీసుకుని అమెరికాలో పర్యటించారు. అలాంటి ప్రయత్నం దేశంలో అంతకు ముందు ఎప్పుడూ జరగలేదు.


నిజాయతీ ఆయనకు ప్రాణం

ఎన్టీఆర్‌కు నిజాయతీ అంటే ప్రాణం. సొంత డబ్బును ఎంత పొదుపుగా వాడేవారో, ప్రభుత్వ ధనం విషయంలో అంతకంటే జాగ్రత్తగా ఉండేవారు. ముఖ్యమంత్రిగా నెలకు ఒక్క రూపాయి గౌరవ వేతనం మాత్రమే తీసుకున్నారు. అధికారిక నివాసానికి మారలేదు. అంబాసిడర్‌ కారు చాలనేవారు.
* ఆయన మొదటిసారి ముఖ్యమంత్రయినప్పుడే అప్పటి కార్మికశాఖ మంత్రి రామచంద్రరావు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీతో సోదాలు చేయించి, మంత్రి పదవి నుంచి తొలగించారు.
* మంత్రి జీవన్‌రెడ్డి కలర్‌టీవీ కొన్నారని తెలిసి ఆయనను ప్రశ్నించారు. వాయిదాల పద్ధతిలో కొన్నానని రసీదు చూపించాకే శాంతించారు.
* వారసులను రాజకీయాలకు దూరంగా పెట్టారు.


సంస్కరణలకు ఆద్యుడు

ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చే వరకు ఆంధ్ర ప్రాంతంలో మున్సబు, కరణాలు, తెలంగాణలో పటేల్‌, పట్వారీలు గ్రామాలను ఉక్కుపిడికిలిలో పెట్టుకున్నారు. ఆ వ్యవస్థను ఎన్టీఆర్‌ రద్దు చేశారు.
* వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్‌ ఫీజు రద్దు చేశారు. సీట్లు అమ్ముకోవడాన్ని నిషేధించారు.వాటిల్లో ఎస్టీ, ఎస్సీ,బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ తీసుకువచ్చారు.
* కంప్యూటర్ల వినియోగాన్ని స్వాగతించారు.
* ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించారు.


విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ

విద్యారంగంలోనూ సంస్కరణలకు నడుంకట్టారు.  తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. 1985లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
* యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండలిలో నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ఉండాల్సింది విద్యావేత్తే తప్ప, విద్యామంత్రి కాదంటూ.. ప్రొ.కె.రామకృష్ణారావును ఛైర్మన్‌గా నియమించారు. ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
* బడి పిల్లలకు విద్యపై అభిరుచి పెంచేలా బాపు, రమణలతో ఆడియో విజువల్‌ పాఠాలు తయారుచేయించారు. వాటిని ప్రదర్శించేందుకు 11 వేల పాఠశాలలకు కలర్‌ టీవీలు అందజేశారు. హైస్కూళ్లలో ఒకేషనల్‌ శిక్షణ ప్రవేశపెట్టారు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం జిల్లాకో గురుకుల విద్యాలయం ఏర్పాటు చేశారు. వాటి స్ఫూర్తితోనే కేంద్రం జవహర్‌ నవోదయ విద్యాలయాల్ని ఏర్పాటు చేసింది.


రూ.2కే కిలో బియ్యం

ఏ పండగకో తెల్ల అన్నం తినే పేద కుటుంబాలకు రెండు పూటలా అన్నం పెట్టేందుకు 1983 ఏప్రిల్‌ 14న రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. దారిద్య్రరేఖకు కొలమానమైన వార్షికాదాయ పరిమితిని రూ.3,600 నుంచి రూ.6 వేలకు పెంచి, 1.43 కోట్ల కుటుంబాలకు ఈ పథకం లబ్ధి అందించారు.


జెండా, ఎజెండా.. ఆయనదే

1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఆవరణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్టీఆర్‌ ప్రకటించారు. ‘నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ’ అని పేర్కొన్నారు. స్వయంగా చిత్రకారుడైన ఆయన రామకృష్ణ సినీ స్టూడియోలో కూర్చుని, తెల్లకాగితంపై నాగలి, గుడిసె, చక్రంతో పార్టీ జెండా గీశారు. నాగలి రైతులకు, గుడిసె పేదలకు, చక్రం శ్రామికులకు సంకేతమన్నారు.


రాజకీయాల్లోకి కొత్త నీరు

20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజినీర్లు, 28 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు సహా 125 మంది పట్టభద్రులు.. వీరంతా 1983 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు. ఎన్టీఆర్‌ రాజకీయాల గతిని ఎంతలా మార్చారో..  యువకులు, విద్యావంతులకు ఎంత పెద్ద ఎత్తున అవకాశాలిచ్చారో చెప్పడానికి ఈ జాబితాయే తార్కాణం. వెనుకబడిన కులాల్లో రాజకీయ స్ఫూర్తి రగిలించారు. వారికి రిజర్వేషన్లు కల్పించి, గెలిపించి మంత్రి పదవులు కట్టబెట్టారు.


పరిపాలనలోనూ విప్లవాత్మక మార్పులు

స్థానిక సంస్థలకు అధికారాల్ని బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణలు చేయడానికి చాలా సంవత్సరాల ముందే ఎన్టీఆర్‌ అధికార వికేంద్రీకరణ చేశారు. తాలూకాలు, బ్లాక్‌లకు బదులు ప్రజల వద్దకే పాలన కోసం రెవెన్యూ మండలాలు, మండల పరిషత్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా, మండల పరిషత్‌లతోపాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు తొలిసారి ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ విభాగాల పనితీరులో సంస్కరణలు తెచ్చేందుకు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ రుస్తుంజీని నియమించారు.


ఆ ప్రచారం ఓ జంఝామారుతం

ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్న ‘రోడ్డు షో’లను ఎన్టీఆర్‌ నాలుగు దశాబ్దాల క్రితమే చేశారు. 1940 మోడల్‌ షెవర్లె వ్యాన్‌ను ‘చైతన్యరథం’గా మార్చుకుని రాష్ట్రమంతా తిరిగారు. ఖాకీ బట్టలు వేసుకుని, మండుటెండల్ని, దుమ్ము, ధూళిని లెక్కచేయకుండా రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. ఎక్కడ జనం గుమికూడితే అక్కడ వాహనంపై నిల్చునే ప్రసంగించేవారు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పట్టారు. 5 వేల మందికి పైగా జనం ఉన్న సభలు రోజుకి 50 వరకు జరిగేవి. రాత్రి ఏ ఒంటిగంటకో రోడ్డుపక్కనున్న తోటలోనో, బడి ఆవరణలోనో వ్యాన్‌ నిలిపేవారు. అక్కడే నిద్ర, ఆరుబయటే స్నానం, బట్టలు ఉతుక్కోవడం. 60 ఏళ్లు దాటిన వయసులో 1982 అక్టోబరు 3 నుంచి 1983 జనవరి 3న తిరుపతిలో ప్రచారసభ ముగిసే వరకు.. 35 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన మొండిఘటం ఆయన.


ప్రజా ఉద్యమంతో కుట్రల్ని ఛేదించి..

1984లో ఎన్టీఆర్‌ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌ మద్దతుతో కుట్ర చేసి ఎన్టీఆర్‌ను గద్దె దించారు. మెజార్టీ లేకపోయినా.. గవర్నర్‌ రామ్‌లాల్‌ ఆయనతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. దాంతో రాష్ట్రం భగ్గుమంది. ఎన్టీఆర్‌కి మద్దతుగా ఉవ్వెత్తున ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాగింది. ఉక్కిరిబిక్కిరైన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గవర్నర్‌ను మార్చేసి, నెల రోజుల్లోనే మళ్లీ ఎన్టీఆర్‌కి ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించారు. 1985లో ఎన్టీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లి, అసాధారణ మెజార్టీతో తిరిగి అధికారం చేపట్టారు.


మహిళలకు ఆస్తిలో సమాన హక్కు

ఎన్టీఆర్‌ అధికారంలోకి రాగానే మహిళాభ్యుదయానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. దేశంలోనే తొలిసారిగా. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలంటూ 1984లో ప్రత్యేక చట్టం చేశారు. విద్య, ఉద్యోగాల్లో వారికి 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అమలు చేశారు.  


బలహీనవర్గాలకు వెన్నుదన్ను

ఎన్టీఆర్‌ వెనుకబడిన తరగతుల వారికి విద్య, ఉద్యోగాల్లో  రిజర్వేషన్లు 25 శాతం నుంచి 44 శాతానికి పెంచారు. అది హైకోర్టులో నిలబడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయడంతో బీసీలు కూడా మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్‌ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో వారే ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రులయ్యారు.  


గిరిజనుల సంక్షేమానికి తపన

మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన పోలీసు కుటుంబాలను పరామర్శించేందుకు ఆదిలాబాద్‌ జిల్లాకు వెళ్లిన ఎన్టీఆర్‌ అక్కడి గిరిజనుల బతుకులు చూసి చలించిపోయారు. గిరిజనుల భూమి గిరిజనులకే చెందుతుందని, గిరిజన ప్రాంతాల్లో చిన్న ఉద్యోగాలన్నీ వారికేనని, ప్రతి గిరిజనుడికీ కనీస అటవీ హక్కులు, అందుబాటులో వైద్యం వంటి 14 చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని.. జీవోలు విడుదల చేశారు.


పారిశ్రామిక పురోగతి- అభివృద్ధి

1982-83 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారీ, మధ్యతరహా పరిశ్రమలు 390 మాత్రమే ఉండేవి. ఎన్టీఆర్‌ హయాంలోనే మరో 216 వచ్చాయి. చిన్న తరహా పరిశ్రమల సంఖ్య 37,813 నుంచి 1989 నాటికి 58,263కి పెరిగింది. ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్‌రంగం స్థాపిత సామర్థ్యం 2,608 మెగావాట్లు ఉండగా, 1987 నాటికి 3,604 మెగావాట్లకు చేరింది. 1980-81లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రూ.26 కోట్ల నష్టం రాగా, 1986-87లో రూ.7 కోట్ల లాభాలు ఆర్జించింది.
* హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌, గుంటూరులోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ ఇంకా పలు చోట్ల బస్టాండ్‌ల నిర్మాణం ఎన్టీఆర్‌ హయాంలోనే జరిగింది.
* అంతర్జాతీయ చలనచిత్రోత్సవ నిర్వహణకు హైదరాబాద్‌లో కేవలం మూడు నెలల్లోనే లలిత కళాతోరణం ఆడిటోరియం నిర్మించారు. 


పేదల సంక్షేమమే ఆయన పథం

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు.. అన్న మాటను ఎన్టీఆర్‌ త్రికరణశుద్ధిగా నమ్మారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన హామీల అమలుకు రూ.1,400 కోట్లు ఖర్చవుతుందని, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి కోన ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. పేదల కోసం రూ.1,400 కోట్లు కాదు, అవసరమైతే రూ.13,500 కోట్లయినా ఖర్చు చేస్తానని ఘాటుగా సమాధానమిచ్చారు.
ః కాంగ్రెస్‌ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఇంటికి రూ.300-500 ఖర్చు చేస్తే.. ఎన్టీఆర్‌ దాన్ని రూ.6 వేలకు పెంచారు. జనతా వస్త్రాలు, వృద్ధులు, వితంతువులకు రూ.30 చొప్పున పింఛను, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, నిరుపేదలకు భూవసతి, మురికివాడల్లోని పిల్లలకు పాల పంపిణీ పథకాలకు శ్రీకారం చుట్టారు.  


తిరుమలతో ప్రత్యేక అనుబంధం

ఎన్టీఆర్‌కి తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. తిరుమలలో వృక్ష సంపద పెంచడానికి హెలికాప్టర్ల నుంచి కొండపై విత్తనాలు చల్లించారు. దివ్యారామం ప్రాజెక్టును ఆవిష్కరించారు. భక్తులు వేచి ఉండేలా క్యూకాంప్లెక్స్‌, తిరుమలలో వేదవిజ్ఞాన పీఠం ఏర్పాటు, ఉచిత అన్నదాన పథకం ప్రారంభం, మూలవిరాట్‌కు వజ్రకిరీటం ఇవన్నీ ఎన్టీఆర్‌ హయాంలోనే జరిగాయి. తిరుమల కొండపై రాజకీయ కార్యకలాపాలు, జెండాలు, బ్యానర్ల ప్రదర్శనను ఎన్టీఆర్‌ నిషేధించారు. తితిదే బోర్డులో ధర్మచింతన కలిగిన వారినే సభ్యులుగా నియమించారు.


రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో ఢీ..

అధికారాలు, నిధులను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని, రాష్ట్రాల్ని ఇబ్బంది పెట్టడాన్ని ఎన్టీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం మిథ్య అన్నారు. గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, అసలు గవర్నర్‌ వ్యవస్థనే రద్దు చేయాలని ఎలుగెత్తారు. రాష్ట్రాల హక్కుల సాధనలో జాతీయ స్థాయిలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చారు.కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి కమిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు వనరుల కేటాయింపు అంశమే ప్రధాన ఎజెండాగా 1983 ఫిబ్రవరిలో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఎన్టీఆర్‌ హాజరయ్యారు. తర్వాత కొన్నాళ్లకే ఈ అంశంపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

* ప్రధాని ఇందిరాగాంధీ అధ్యక్షతన జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో.. జమ్ముకశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండిస్తూ పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రుల తరపున సిద్ధం చేసుకున్న రాజకీయ ప్రకటనను ఎన్టీఆర్‌ చదవడం సంచలనం సృష్టించింది. ప్రధాని వారిస్తున్నా వినకపోవడంతో దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నామని ప్రకటించడంతో..నలుగురు సీఎంలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.


జాతీయ రాజకీయాల్లోనూ మెరిశారు

1983లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు  చొరవ చూపారు. సైద్ధాంతికంగా భిన్న ధ్రువాలైన భాజపా, వామపక్షాల నాయకుల్ని ఒకే వేదికపై తేగలిగారు. తెదేపా, జనతా పార్టీ, లోక్‌దళ్‌, జన్‌మోర్చా, డీఎంకే, ఏజీపీ, కాంగ్రెస్‌ (ఎస్‌) వంటి పార్టీలన్నీ కలిసి 1988లో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశాయి. దాని ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌ 1989లో కేంద్రంలో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రావటంలో చురుకైన పాత్ర పోషించారు. 

తెలుగుభాషపై వల్లమాలిన ప్రేమ
తెలుగుభాష, సంస్కృతి అంటే ఎన్టీఆర్‌కు అమితమైన ప్రేమ. ప్రభుత్వ కార్యాలయాలకు తెలుగు పేర్లే పెట్టారు. సంతకం తెలుగులోనే చేసేవారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు చేపట్టారు. తన హయాంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకానికీ తెలుగులోనే పేర్లు పెట్టారు.


ఎన్టీఆర్‌ దగ్గర పనిచేయడానికి నన్ను ఒప్పించింది కాంగ్రెస్‌ మాజీ సీఎం  

- జయప్రకాశ్‌నారాయణ్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి

డబ్బు, పేరు ఉన్నాయి కదా...వాటిని ఉపయోగించుకుని ముఖ్యమంత్రి అయిపోదామని ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాలేదు. పేదలకు సేవ చేయాలన్న ఆర్తితో వచ్చారు. ఎన్టీఆర్‌ తన దగ్గర పనిచేయమని కోరితే నేను నిరాకరించాను. కానీ నన్ను ఒప్పించింది ఎన్టీఆర్‌కి రాజకీయంగా బద్ధశత్రువైన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఎన్టీఆర్‌ మళ్లీ భారీ మెజార్టీతో గెలిచారని, చిత్తశుద్ధిగల వ్యక్తి అని, ఆయన దగ్గర పనిచేయనంటే ఇక ప్రజలపై మీకేం కమిట్‌మెంట్‌ ఉన్నట్టని ఆయన నన్ను ప్రశ్నించారు.


కోపంలోనూ సంస్కారం తప్పేవారు కాదు

- హెచ్‌.జె.దొర, మాజీ డీజీపీ

ఎన్టీఆర్‌కు కోపం ఎక్కువని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. ఆయన కోపం ప్రదర్శించే పద్ధతి కూడా సంస్కారవంతంగా ఉండేది. విపరీతమైన కోపం వస్తే ‘ఐయామ్‌ సారీ.. మీరు ఇలా చేస్తారని అనుకోలేదు’ అని అనేవారు. పరుషంగా, చులకనగా మాట్లాడటం, చిన్నతనంగా చూడటం లాంటివి లేనేలేవు. ఎవరికైనా సరే అవసరానికి మించి గౌరవం ఇచ్చేవారు.


వ్యక్తిగతం

1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ జననం. తల్లిదండ్రులు లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ. పెదనాన్న రామయ్య దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి దగ్గరే ఎక్కువ పెరిగారు. నిమ్మకూరులో ఐదో తరగతి వరకు, విజయవాడలో హైస్కూల్‌ విద్య. ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువు.

1942 మే 2న మేనమామ కుమార్తె బసవతారకంతో వివాహం. ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు

1947 గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌గా గుంటూరు జిల్లాలో ఉద్యోగంలో చేరారు. అది నచ్చక 11 రోజులకే రాజీనామా చేశారు.

1949 ‘మనదేశం’తో చిత్రరంగ ప్రవేశం

1982 మార్చి 12న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన 

1983 జనవరి 9న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం. నాలుగు పర్యాయాలు మొత్తం ఏడున్నరేళ్లపాటు సీఎంగా బాధ్యతలు.

1996 జనవరి 18న 72 ఏళ్ల వయసులో అస్తమయం

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని