మహానాడుకు జన ప్రభంజనం

మహానాడు అంటేనే... తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించుకునే పండుగ. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకూ ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమమిది. గతంలో జరిగిన విషయాలను సమీక్షించుకోవడంతో పాటు.. భవిష్యత్తుకు మార్గనిర్దేశం..

Updated : 28 May 2022 06:56 IST

 మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

మహానాడు అంటేనే... తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించుకునే పండుగ. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజల వరకూ ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురుచూసే కార్యక్రమమిది. గతంలో జరిగిన విషయాలను సమీక్షించుకోవడంతో పాటు.. భవిష్యత్తుకు మార్గనిర్దేశం కూడా ఈ వేదిక మీదే జరుగుతుంది. మూడు సంవత్సరాల విరామం తర్వాత భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అనంతపురం నుంచి ఉత్తరాంధ్ర వరకూ అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల వారూ పోటెత్తారు. సొంత వాహనాలు సమకూర్చుకుని, బస్సులు, రైళ్లలోను, చివరకు ఆటోలు కట్టించుకునీ నేరుగా వచ్చేశారు. తెదేపా ఈసారి మహానాడును తొలిరోజు పార్టీ ప్రతినిధుల సమావేశంగానే నిర్వహించాలనుకుంది. 12వేల నుంచి 14వేల మంది వరకు వస్తారని భావించింది. కానీ పార్టీ అభిమానులు, సామాన్య ప్రజలు భారీగా తరలి రావడంతో ఇది బహిరంగ సభగా మారిపోయింది.

జడత్వం వదిలి ఉత్సాహంగా అడుగులు
ఎన్నికలకు మరో రెండేళ్లే ఉండటం, ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతుండటంతో తెదేపా కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇన్నాళ్లూ అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల నిర్బంధంతో తెదేపా కార్యకర్తలతో పాటు, అభిమానులు, మద్దతుదారులు బయటకు వచ్చేందుకు జంకేవారు. ఇప్పటికీ నిర్బంధాలున్నా.. వారిలో తెగింపు వచ్చింది. జడత్వం వదిలింది. ఇటీవల పార్టీ కార్యక్రమమంటే నాయకుల కంటే వారే ముందుగా వస్తున్నారు. తెదేపా మహానాడుకు అదే తెగింపుతో బయల్దేరి వచ్చారు. మహానాడుకు హాజరైన వారిలో చిన్న రైతులు, రెక్కాడితే గానీ డొక్కాడని వారు, శ్రామికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమపై నిర్బంధాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ పథకాలు ఆపేస్తామన్న బెదిరింపులూ ఉన్నాయని వారిలో కొందరు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెదేపాను గెలిపించుకోవాలన్న కసితో మహానాడుకు తరలివచ్చామని వారు పేర్కొన్నారు. వారిలో చాలామంది స్వచ్ఛందంగా వచ్చినవారే. కడప నుంచి తెదేపా అభిమానులు స్వర్ణలత, నిర్మలతో పాటు మరో ఇద్దరు రూ.10వేలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. తెదేపా అంటే తమకు అభిమానమని, ఈసారి ఎలాగైనా పార్టీ అధికారంలోకి రావాలన్నదే తమ అభిమతమని వారు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి 20మంది సామాన్య మహిళలు సొంత ఖర్చుతో ఆటోల్లో వచ్చారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి 11 మంది సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ప్రత్యేకంగా వాహనం పెట్టుకుని వచ్చారు. ‘మాకు వైకాపా నాయకుల నుంచి రోజూ వేధింపులు ఉన్నాయి. వారి పొలం గట్టుపై నడవనివ్వరు. అయినా తెదేపా అంటే మాకు ప్రాణం. పార్టీ పెట్టినప్పటి నుంచీ తెదేపాతోనే ఉన్నాం’ అని నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలానికి చెందిన 70 ఏళ్ల సముద్రాల భాస్కర్‌ చెప్పారు.

ఎటు చూసినా కోలాహలం
తెదేపా మహానాడు తొలిరోజు కార్యక్రమం అట్టహాసంగా, మహా ఉత్సవంలా జరిగింది. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారని తెదేపా నాయకులు తెలిపారు. ఉదయం 6గంటల నుంచే నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల రాక మొదలైంది. ప్రతినిధుల నమోదు మొదలవక ముందే ముందు వరుస కుర్చీలు నిండిపోయాయి. మహానాడు వేదికను జాతీయ రహదారి నుంచి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో పాటు, వేదిక నుంచి జాతీయ రహదారి వరకు మధ్యలో ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలన్నీ నిండిపోవడంతో, పెద్ద సంఖ్యలో జనం నిల్చుని కార్యక్రమాలు చూశారు. పార్టీ జెండాలు, బ్యాడ్జీలను ఉత్సాహంగా కొంటూ కనిపించారు. చంద్రబాబు ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు... ఉత్సాహంగా దూసుకువస్తున్న కార్యకర్తల్ని నిలువరించలేకపోయారు. కార్యకర్తలు చంద్రబాబు ప్రత్యేక వాహనంపైకి ఎక్కేసి కార్యక్రమాన్ని చూసేందుకు ఉత్సాహం కనబరిచారు. వేదికకు రెండువైపులా పెద్దసంఖ్యలో కార్యకర్తలు గుమిగూడటంతో నాయకులు వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. చంద్రబాబు వేదికపైకి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు ప్రాంగణమంతా నినాదాలు, ఈలలతో హోరెత్తింది. వేదికపై ఉన్న చంద్రబాబును, ఇతర నాయకుల్ని ఫొటోలు తీసుకునేందుకు వెనక ఉన్నవారంతా ముందుకు తోసుకువచ్చారు. పార్టీ ముఖ్య నాయకులు ఆవేశపూరితంగా ప్రసంగించినప్పుడు, వైకాపా ప్రభుత్వంపైనా, నాయకులపైనా విమర్శలు చేసినప్పుడు పెద్ద ఎత్తున స్పందన లభించింది. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తెదేపా చేసిన కృషికి సంబంధించి ఉత్తేజభరితంగా రూపొందించిన ఆడియోగీతం ఉర్రూతలూగించింది.

* మహానాడుకు వచ్చేవారికి ఏర్పాట్లు చేయడంలో తొలిరోజు పలు లోటుపాట్లు కనిపించాయి. అంచనాలకు మించి ప్రజలు తరలిరావడంతో కొందరికి భోజనం దొరకలేదు. మంచినీళ్లకూ కొరత ఏర్పడింది. సభా ప్రాంగణంలో కూలర్లు లేక.. ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. తెదేపాకు ఇదివరకు అత్యంత పటిష్ఠమైన వాలంటీర్ల వ్యవస్థ ఉండేది. ఈసారి మహానాడులో వాలంటీర్ల సేవలు అందలేదు. వాలంటీర్లు తగినంతగా లేకపోవడం, పోలీసులూ తక్కువగా ఉండటంతో భారీగా తరలివచ్చిన జనాన్ని నియంత్రించలేకపోయారు.

‘‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌కు ఒక ఆణిముత్యమైతే... అలాంటి వందల ఆణిముత్యాల్ని ఆ నగరానికి నేను తీసుకొచ్చా. తాజాగా జరిగిన ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకల్లో మఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఆ సందర్భంలో నన్ను గుర్తు తెచ్చుకోకపోవచ్చు. కానీ తెలుగుజాతి కోసం ఆరోజు పడిన శ్రమ నాకెప్పుడూ తృప్తినిస్తుంది. అప్పట్లో ప్రధాని వాజపేయీతో ఐఎస్‌బీకి ప్రారంభోత్సవం చేయించాం. అప్పట్లో బెంగళూరులోగానీ, ముంబయిలోగానీ ఐఎస్‌బీని పెట్టాలని వారి బృందం ఆలోచిస్తోంది. వారిని హైదరాబాద్‌కు పిలిచాను. మీరు మిగతా రాష్ట్రాలన్నీ తిరిగి    రండి. ఆయా ప్రభుత్వాలు ఏం ప్రతిపాదనలు ఇస్తాయో చూడండి. వాటన్నింటికీ మించి నేను ప్రభుత్వం తరఫున చేస్తానని చెప్పా. ఫలితంగా వారు హైదరాబాద్‌లో ఐఎస్‌బీ పెట్టారు.


శనివారం జరిగే సమావేశానికి రాకుండా చూసేందుకు అనేక అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు. కాలి నడకన, ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో అయినా పెద్ద ఎత్తున తరలిరావాలి. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. ప్రజల కోసం మనం పోరాటం చేస్తున్నాం’’

- మహానాడులో తెదేపా అధినేత చంద్రబాబు


60 వేల మందికి భోజనాలు

విజయవాడకు చెందిన కె.శివాజీ నేతృత్వంలో భోజన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 60వేల మంది భోజనం చేశారని నిర్వాహకులు తెలిపారు. రాత్రికి 15వేల మందికి వంట చేశామన్నారు. శనివారం లక్ష మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నామని, ఇంకా పెరిగినా అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వాస్తవానికి ప్రతినిధుల సభకు 12వేల మందికి వసతి ఏర్పాటు చేసినా అంతకు 5రెట్లు రావడంతో ఒక దశలో భోజనాలు అందించడం కష్టతరంగా మారింది. దాదాపు 30 కౌంటర్లు ఏర్పాటు చేసినా రద్దీ తగ్గలేదు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని