మరో శ్రీలంకలా ఆంధ్రప్రదేశ్‌!

‘ఆర్థిక నేరస్థుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక కాబోతోంది. ఇప్పటికే రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిన శ్రీలంక అధ్యక్షుడి ఇంటిని ప్రజలు యువత ముట్టడించినట్లే త్వరలో జగన్‌రెడ్డి ఇంటినీ ప్రజలు ముట్టడించే పరిస్థితి తెచ్చుకునేలా ఉన్నారు

Updated : 28 May 2022 05:56 IST

 ఇప్పటికే రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు
రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది
ఏపీని కాపాడుకుందాం
తెదేపా రాజకీయ తీర్మానం

‘ఆర్థిక నేరస్థుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక కాబోతోంది. ఇప్పటికే రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిన శ్రీలంక అధ్యక్షుడి ఇంటిని ప్రజలు యువత ముట్టడించినట్లే త్వరలో జగన్‌రెడ్డి ఇంటినీ ప్రజలు ముట్టడించే పరిస్థితి తెచ్చుకునేలా ఉన్నారు. కరెంటు ఛార్జీల పెంపు, పన్నుల బాదుడుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంకలా మారే ప్రమాదం కనిపిస్తోంది’ అంటూ తెలుగుదేశం పార్టీ రాజకీయ తీర్మానం పేర్కొంది. మహానాడులో ఆ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అభివృద్ధి వెనకబడిందని, మాఫియాకు కేంద్రంగా మారిందని, విధ్వంస పాలన సాగుతోందని, రాష్ట్రమే టెర్రరిజం సృష్టిస్తోందని విమర్శించింది. సంక్షేమం కొరవడి పాలన అవినీతితో నిండిపోయిందని ఆక్షేపించింది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలని, రైతులు, మహిళలు, యువతపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ పునఃనిర్మాణానికి తెలుగుదేశం కార్యకర్తలంతా కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చింది. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా ధీటుగా ఎదుర్కొని విజయం సాధించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా రాజకీయ తీర్మానం పిలుపునిచ్చింది.

తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇవి..

* తెదేపా ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ప్రస్తుతం ఒక అంకెకే పరిమితమైంది. రాష్ట్రం మూడేళ్ల వైకాపా పాలనలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా, జె ట్యాక్స్‌ కోసం ఉన్న పరిశ్రమలను తరిమేసి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఏపీని రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలిపారు.
* ప్రజాస్వామ్యానికి జగన్‌రెడ్డి ప్రమాదకరంగా తయారయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేకుండా చేశారు. నామినేషన్‌ పత్రాలు చించివేత, ధ్రువ పత్రాలు ఇవ్వకుండా చేయడం, దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ వంటి వాటితో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు.

* డ్రగ్స్‌, ఎర్రచందనం, గంజాయి, ల్యాండ్‌, శాండ్‌, వైన్‌ మాఫియాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చి దోపిడీ చేస్తున్నారు
* ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసకర పాలన మొదలు పెట్టిన జగన్‌రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అమరావతిని నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టును సందిగ్ధంలోకి నెట్టారు. మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు వెనకేసుకున్నారు.

అత్యాచారాలపై ప్రశ్నిస్తే యాగీ అంటారా?
రాష్ట్రంలో ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారంపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నిస్తే... నానాయాగీ చేస్తున్నారని సీఎం జగన్‌ అన్నారంటే, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా? అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. ‘మహిళలపై నేరాలు- గంజాయి, డ్రగ్స్‌’ తీర్మానాన్ని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధతో కలిసి ఆమె ప్రవేశపెట్టారు. మహిళా నేత గ్రీష్మ బలపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ‘అసమర్థుడిని సీఎంగా ఎన్నుకుని మూడేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాదయాత్రలో అసత్యాలను ప్రచారం చేసిన జగన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మహిళలపై విపరీతంగా దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని ధ్వజమెత్తారు.

 ‘వేధింపులు, కక్ష సాధింపు చర్యలు’
‘డ్రైవర్‌ హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను సస్పెండ్‌ చేసి చర్యలు తీసుకున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో పేరున్న అవినాష్‌రెడ్డి, ఏడు నెలలుగా జైల్లో ఉన్న శివశంకర్‌రెడ్డిలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీ రహస్యాలు బయటకు వస్తాయని భయమా?’ అని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ప్రశ్నించారు. ‘వేధింపులు, కక్ష సాధింపు చర్యలు’ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఆర్థికంగా దెబ్బతీయడం, కేసులు పెట్టడం, బెదిరించడం ఈ ప్రభుత్వంలో నిత్యకృత్యమైంది. చివరకు సీబీఐ డ్రైవర్‌ను సైతం బెదిరించే స్థాయికి చేరారు. వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడినందుకు నన్ను బెంగళూరులో అరెస్టు చేసి 14 రోజులు జైల్లో పెట్టారు. పులివెందులలో ఉండి ఇన్ని ఎదుర్కొంటున్న నన్నే ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఎవరినీ ఏమీ చేయలేరు’ పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని బలపరిచేందుకు కర్నూలు మాజీ జడ్పీ ఛైర్మన్‌ బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ.. పనిచేసే ముఖ్యమంత్రిగా గుర్తింపున్న చంద్రబాబును 2024 ఎన్నికల్లో 160 సీట్లతో అసెంబ్లీకి వెళ్లాలని కోరారు.

‘కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు
వైకాపా ఎమ్మెల్యే అవినీతిని బయటపెడతానని ప్రకటించిన తన భర్తను ఎమ్మెల్యే బావమరిది బంగార్రెడ్డి అత్యంత కిరాతకంగా చంపించారని ప్రొద్దుటూరుకు చెందిన తెదేపా నాయకుడు, గతంలో కడప జిల్లా తెదేపా అధికార ప్రతినిధిగా పనిచేసి హత్యకు గురైన నందం సుబ్బయ్య భార్య నందం అపరాజిత తెలిపారు. అయినా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయలేదని.... దీనిపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేసి పోరాడుతున్నానని ఆమె వివరించారు. తన భర్త చనిపోయిన నాటి నుంచి ఇప్పటివరకూ ప్రతి సందర్భంలోనూ తెదేపా తనకు అండగా నిలిచిందని చెప్పారు. తన పిల్లల చదువుల బాధ్యతను కూడా పార్టీయే చూస్తోందని వ్యాఖ్యానించారు. ‘కార్యకర్తలపై ప్రభుత్వ వేధింపులు- అండగా నిలిచిన పార్టీ’ అనే అంశంపై పోలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల నుంచి పలువురు మాట్లాడారు.

సైకో పాలన పోవాలంటే సైకిల్‌కు ఓటేయాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించడమే వారికి చేసే సామాజిక న్యాయమా? అని తెదేపాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు ప్రశ్నించారు. భజన చేసేవారికి మంత్రి పదవులిచ్చి దాన్నే సామాజిక న్యాయమంటే జనం నమ్మరని అన్నారు. బడుగులు, బలహీనవర్గాలవారికి మళ్లీ రాష్ట్రంలో ఆత్మగౌరవం రావాలంటే తెదేపా జెండా రెపరెపలాడాలని పేర్కొన్నారు. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరుగుతున్న ద్రోహం’ తీర్మానాన్ని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్‌, కిమిడి నాగార్జున, సప్తగిరి ప్రసాద్‌ ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు. ‘దళితులు మళ్లీ ఆత్మగౌరవంతో బతకాలంటే రాష్ట్రంలో పసుపు జెండా రెపరెపలాడాలి. రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటే సైకిల్‌కు ఓటేయాలి. సైకిల్‌ రథ చక్రాల కింద ఫ్యాను నలిగిపోవాలి. నిండు సభలో చంద్రబాబుతో కన్నీరుపెట్టించిన రాక్షస సంత కంట రక్త కన్నీరు కార్పించాలి’ అని ఎంఎస్‌రాజు వ్యాఖ్యానించారు.

- మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని