గ్రామాల్లోనూ ఆస్తిపన్ను 5% పెంపు!

గ్రామీణులపై మరో పన్ను పిడుగు పడనుంది. పల్లెల్లో ఆస్తి పన్నును 5% పెంచేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నిరుడూ ఇలాగే 5 శాతం పెంచారు. ఈ ఏడాది పెంపుపై

Published : 28 May 2022 05:09 IST

ప్రజలపై రూ.35 కోట్ల భారం

గత ఏడాదీ పెంచిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: గ్రామీణులపై మరో పన్ను పిడుగు పడనుంది. పల్లెల్లో ఆస్తి పన్నును 5% పెంచేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నిరుడూ ఇలాగే 5 శాతం పెంచారు. ఈ ఏడాది పెంపుపై ఉత్తర్వులేమీ ఇవ్వలేదు. కానీ... పెంచేసి, అమలు చేయాలని మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి. గత సంవత్సరం జారీ చేసిన మార్గదర్శకాలనే అనుసరించాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశిస్తున్నారు. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించాలన్న కొత్త విధానంతో నగరాలు, పట్టణాల్లో రెండేళ్లుగా పన్నులు పెరిగాయి. గ్రామ పంచాయతీల్లో గత ఏడాది చెల్లించిన పన్నుపై 5% పెంచి వసూలు చేయనున్నారు. దీంతో గ్రామీణులపై రూ.35 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీల్లో నివాసాలు, నివాసేతరాల నుంచి ఏటా రూ.700 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలనేది లక్ష్యం. అయితే... 70-80% వరకు వసూళ్లు జరుగుతున్నాయి. గత ఏడాది (2021-22)లో 5 శాతం పెంచి అన్ని పంచాయతీల్లోనూ పన్నులు వసూలు చేశారు. 2022-23లోనూ మరో 5 శాతం పెంచి పన్నులు వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు సన్నాహాలు చేస్తున్నారు. అసెస్‌మెంట్ల (నివాసాలు, నివాసేతరాలు) వారీగా ఆన్‌లైన్‌లో పన్నులు పెంచనున్నారు. ఈ మొత్తాలను నవంబరు నెలాఖరుకు 20%, డిసెంబరులో 40%, జనవరిలో 60%, ఫిబ్రవరిలో 80%, మార్చి నెలాఖరుకు 100% వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విద్యుత్తు ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామీణులు... ఆస్తిపన్ను పెంపుపై ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని