Updated : 29 May 2022 10:29 IST

నందమూరి కీర్తి అజరామరం

తెలుగుజాతిని ప్రభావితం చేసిన తీరు నభూతో నభవిష్యతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

ఈనాడు, దిల్లీ: తెలుగు నేలను, జాతిని ఎన్టీ రామారావు ప్రభావితం చేసిన తీరు నభూతో నభవిష్యతి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ కొనియాడారు. అడుగుపెట్టిన ప్రతీ రంగాన్ని సుసంపన్నం చేసిన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని, కీర్తి అజరామరమని, తెలుగుజాతి ఉన్నంతవరకూ ఎన్టీఆర్‌ జయంతులు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా శనివారం విడుదల చేసిన ప్రకటనలో జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తన భావాలను వ్యక్తం చేశారు. ‘విభిన్న రంగాల్లో మహా నాయకుడిగా విశ్వవిఖ్యాతులైన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. 1950ల ఆరంభంలో తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటైన మూడు దశాబ్దాల వరకూ తెలుగువాళ్లను మదరాసీలనే పిలిచేవారు. ఎన్టీఆర్‌ రాజకీయరంగ ప్రవేశం చేసి, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తట్టిలేపిన తర్వాతే తెలుగు జాతికి విశిష్టమైన గుర్తింపు లభించడం ప్రారంభమైంది. అఖిలాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పట్టి ఆయనకు అపూర్వ విజయం ప్రసాదించి.. దేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ప్రజలే దేవుళ్లు... సమాజమే దేవాలయం అంటూ నినదించిన ఎన్టీ రామారావు సంక్షేమ రాజ్యానికి కొత్త నిర్వచనం చెప్పారు. ఆయన జనరంజక పాలన దేశమంతటా అనుసరణీయమైంది. ఎన్టీఆర్‌ గొప్ప ప్రజాస్వామిక, లౌకికవాది. రాజ్యాంగబద్ధుడు. ఆదర్శపాలకుడు. పేదలపాలిట పెన్నిధి. ప్రజల మనిషిగా ప్రజల కోసం పని చేయదలచుకున్న ఔత్సాహికులందరికీ ఆయన జీవితం ఆదర్శం. తెలుగు నేలను, జాతిని రామారావు ప్రభావితం చేసిన తీరు నభూతో నభవిష్యతి. ఆయన ఆశీర్వాదాలతో రాజకీయరంగ ప్రవేశం చేసిన నాటి యువ నేతలు, విభిన్న పార్టీల్లో రాణిస్తూ ఉండటం... ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టిన కొత్త ఒరవడికి ప్రజలు వేసిన ఆమోద ముద్రకు నిదర్శనం. వ్యక్తిగతంగానూ నాకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉంది. ఆ మహనీయుడికి, మార్గదర్శకుడికి నా నమస్సులు’ అని పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని