Andhra News: ‘ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొట్టారు’

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై దౌర్జన్యం చేసి, మూడుసార్లు చెంప మీద కొట్టారని పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్‌ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ (ఏఈఈ) సూర్యకిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 02 Jun 2022 10:19 IST

జలవనరుల శాఖ సమీక్షా సమావేశంలోనే దౌర్జన్యం

పోలీసులకు పోలవరం ఇంజినీర్‌ సూర్యకిరణ్‌ ఫిర్యాదు  

ఈనాడు డిజిటల్‌ - రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే - నేరవార్తలు, సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై దౌర్జన్యం చేసి, మూడుసార్లు చెంప మీద కొట్టారని పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ రెండో డివిజన్‌ సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ (ఏఈఈ) సూర్యకిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన అనంతరం బాధితుడు విలేకర్లతో మాట్లాడారు. బాధితుడి వివరాల మేరకు... పోలవరం ప్రధాన ఎడమ కాలువకు సంబంధించిన పుష్కర కాలువ రంగంపేట పరిధిలో ఉంది. దాని పూడికతీత, అభివృద్ధి పనులు చేయాలని ఆయకట్టు రైతులు కోరగా.. నిధులు మంజూరు కాలేదని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. తామే ఆ పనులు చేపడతామని, నిధులు మంజూరయ్యాక ఇవ్వాలని రైతులు వారిని ఒప్పించి పనులు చేశారు. రెండేళ్లయినా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించాలని ఏడాదిగా ఎమ్మెల్యే అధికారులను అడుగుతున్నారు. బుధవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఈ విషయం గురించి ఎమ్మెల్యే.. కార్యనిర్వాహక ఇంజినీరు సూర్యకిరణ్‌ను ప్రశ్నించారు. వివరణ ఇస్తుండగానే.. ఆయన ఆగ్రహంతో తనను మూడుసార్లు చెంపపై కొట్టారని తెలిపారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా వారు కనీసం ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించలేదని సూర్యకిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈల అసోసియేషన్‌ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి నేపథ్యంలో.. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధవళేశ్వరం జలవనరుల శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఏఈల అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. 

మాకు ఫిర్యాదు అందలేదు: సీఐ

సూర్యకిరణ్‌ తాను ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాననీ.. జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో సీఐకి అందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అయితే తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధుబాబు చెప్పడం గమనార్హం. మరోవైపు దాడి అంశంపై ఎమ్మెల్యే రాజాను సెల్‌ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

గతంలోనూ ఉదంతాలు 

* 2017లో సీతానగరం మండలం జాలిమూడి వద్ద ఇసుక లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రాజా ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చిన ప్రభుత్వోద్యోగిపై ఆయన చేయి చేసుకున్నారు.  

* 8 నెలల కిందట సీతానగరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గణిత అధ్యాపకుడు పులుగు దీపక్‌.. ఎంపీ భరత్‌ చేతుల మీదుగా బాడీఫ్రీజర్‌ ప్రారంభించే కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే.. దీపక్‌ను ముగ్గళ్ల సచివాలయానికి పిలిపించి దురుసుగా ప్రవర్తించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే రాజా వర్గీయులు దాడి చేసి తన కారును ధ్వంసం చేశారని దీపక్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు 14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని