ఫెయిలైన విద్యార్థులకు 10 గ్రేస్‌ మార్కులివ్వాలి

పదో తరగతి ఫెయిలయిన విద్యార్థులకు 10 గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని.. రీ కౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షల కోసం వారి నుంచి రుసుములు వసూలు చేయకూడదని జనసేన అధ్యక్షుడు

Updated : 09 Jun 2022 07:12 IST

పదిలో రీకౌంటింగ్‌, సప్లిమెంటరీకి

రుసుములు వసూలు చేయకూడదు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: పదో తరగతి ఫెయిలయిన విద్యార్థులకు 10 గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని.. రీ కౌంటింగ్‌, సప్లిమెంటరీ పరీక్షల కోసం వారి నుంచి రుసుములు వసూలు చేయకూడదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష తప్పటానికి తల్లిదండ్రులే కారణమంటూ నెపాన్ని వారిపై నెట్టేసి ఈ ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవచ్చేమో కానీ.. వైకాపా హయాంలో విద్యావ్యవస్థలోని లోపభూయిష్ట విధానాల్ని మాత్రం చరిత్ర దాచిపెట్టుకోదని విమర్శించారు. ‘2018లో 94.48% ఉత్తీర్ణత వచ్చింది. 2019లో 94.88 శాతం. ఈ ఏడాది ఉత్తీర్ణత 67.26 శాతమే. గత ఫలితాలతో పోలిస్తే ఇది అత్యల్పం. నాడు- నేడు పేరిట పాఠశాలలకు రంగులేస్తున్నాం.. ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు చెప్పిస్తున్నాం అనగానే సరిపోదు. నాడు- నేడులో వెచ్చించామంటున్న రూ.16 వేల కోట్లు ఎటు పోయాయి? వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. తగినంత మంది బోధనా సిబ్బందిని నియమించలేదు. అరకొరగా ఉన్న ఉపాధ్యాయుల్ని మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్ల నిర్వహణ విధుల్లో వేశారు. మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకంలో ఫొటోలు తీయటం వంటి పనులు అప్పగించి బోధన విధులకు దూరం చేశారు. వాటన్నింటి పర్యవసానమే తాజా ఫలితాలు. ఇలాంటి పరిస్థితుల్లో రీ వాల్యుయేషన్‌ చేస్తాం.. ఒక్కొక్కరూ రూ.500 కట్టండి అంటూ ప్రభుత్వం మరో దోపిడీకి తెరతీసింది. పరీక్ష తప్పిన విద్యార్థుల మానసిక స్థితి, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి’ అని పవన్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వంపై రోత కలుగుతోంది
‘పట్టుమని పది పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు. గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు అండగానూ నిలవలేరు. ధరల్ని నియంత్రించి ప్రజల్ని సంతోషపెట్టనూ లేరు. కనీసం పిల్లలకు సరైన చదువైనా చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా? పదో తరగతి ఫలితాలు చూస్తే ఆ పని కూడా ప్రభుత్వానికి చేతకావట్లేదని అర్థమవుతోంది. పిల్లలు పరీక్షల్లో తప్పితే ఇంట్లో తల్లిదండ్రులు మార్గదర్శనం సరిగా లేదని ప్రభుత్వం నెపం వేస్తోంది. ఆడపిల్లల మానమర్యాదలకు ఎవరైనా భంగం కలిగిస్తే నేరగాళ్ల ‘తల్లుల పెంపకం సరిగా లేదు’ అని మంత్రులు అంటున్నారు. ఈ ప్రభుత్వంపై రోత కలుగుతోంది’ అని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

తిట్టినవారే పొగుడుతున్నారంటే అది మైండ్‌గేమే
అప్పటి వరకూ మనల్ని తిట్టిన నాయకుడు ఉన్నపళంగా మనల్ని పొగుడుతున్నాడంటే అది వారి మైండ్‌గేమ్‌లో భాగమేనని గుర్తించాలని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతే తప్ప ఆ పొగడ్తలు చూసి సదరు నాయకుడు పరివర్తన చెందాడని మనం చప్పట్లు కొట్టి, సంతోషం ప్రదర్శించే ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు