AP High Court: అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు

తెదేపా సీనియర్‌ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి ఇదేం పని అని ప్రశ్నించింది. సూర్యాస్తమయం

Updated : 12 Oct 2022 12:14 IST

అయ్యన్న ఇంటి ప్రహరీ పడగొట్టడంపై విస్మయం

కోర్టు మార్గదర్శకాలున్నా ఇదేం పద్ధతని ఘాటు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: తెదేపా సీనియర్‌ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అర్ధరాత్రి ఇదేం పని అని ప్రశ్నించింది. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలుండగా ఇదేం పద్ధతి? అంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేసింది. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని అధికారులకు తక్షణం తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ ఆదివారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. తమ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌ ఆదివారం హైకోర్టులో (హౌజ్‌ మోషన్‌) అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేశారన్నారు. తహసీల్దార్‌, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారన్నారు. రాజకీయ కక్షతో.. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని చెప్పారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అర్ధరాత్రి కూల్చివేతలేంటని విస్మయం వ్యక్తంచేశారు. రెవెన్యూశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఇప్పటికే కొంతభాగం కూల్చివేత జరిగిందని చెప్పారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీంతో విచారణను ఈనెల 21కి వాయిదా వేసిన న్యాయమూర్తి.. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దని అధికారులకు తేల్చిచెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని