వైకాపా మద్దతు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు వైకాపా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ దాఖలు

Updated : 24 Jun 2022 05:40 IST

ప్రత్యేక హోదా లాంటి షరతులేమీ లేకుండానే ఎన్డీయే అభ్యర్థిని బలపరచాలని నిర్ణయం
ద్రౌపదీ ముర్ము నామినేషన్‌కు పార్టీ తరఫున హాజరుకానున్న విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు వైకాపా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ద్రౌపదీ ముర్ము నామినేషన్‌ దాఖలు చేయనున్నందున ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు జగన్‌ సిద్ధమై ఆగిపోయారు. శుక్రవారం ఉదయం 7:30 గంటలకు దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో చర్చ జరిగింది. అందువల్ల శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడనుందని కూడా ప్రచారం సాగింది. రాత్రికి పరిణామాలు మారాయి. సీఎం దిల్లీకి వెళ్లడం లేదంటూ ఆయన కార్యాలయం నిర్ధారించింది.

‘స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక గిరిజన వ్యక్తికి అందులోనూ మహిళకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామంగా వైకాపా భావిస్తోంది. అందువల్లే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ముకు మద్దతు తెలియజేస్తున్నాం. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయానికి దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా ద్రౌపదీ ముర్ముకు మద్దతు ప్రకటిస్తున్నాం. ముందుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్ణయించుకున్నందున రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం హాజరు కావడం లేదు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి హాజరవుతారు’ అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

బేషరతుగానే మద్దతు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలన్న షరతు పెట్టాలని పలు సంఘాలు ప్రభుత్వాన్ని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే వాటిని వైకాపా పరిగణనలోకి తీసుకోలేదనీ, బేషరతుగానే ఎన్డీయే అభ్యర్థికి మద్దతునిచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ప్రకటనను చూస్తే అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని