పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా నిలిచి.. వారికి ఏ సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘మీ సమస్యను నా సమస్యగా భావిస్తా.. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు

Published : 24 Jun 2022 02:42 IST

ఏడాదిన్నరలో అపాచీ పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభం
రూ.4 వేల కోట్ల పెట్టుబడులతో సంస్థల ఏర్పాటు
20 వేల మందికి ఉపాధి అవకాశాలు: సీఎం జగన్‌

ఈనాడు, తిరుపతి: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా నిలిచి.. వారికి ఏ సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘మీ సమస్యను నా సమస్యగా భావిస్తా.. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తాను’ అని తెలిపారు. గురువారం తిరుపతి పరిధిలోని కొన్ని పరిశ్రమలకు భూమిపూజ చేసి, మరికొన్నింటిని ప్రారంభించారు. హిల్‌టాప్‌ సెజ్‌లో అపాచీ, డిక్సన్‌ పరిశ్రమల స్థాపనకు, ఫాక్స్‌లింక్స్‌ విస్తరణకు భూమిపూజ చేశారు. టీసీఎల్‌, సన్నీ ఒప్పోటెక్‌ పరిశ్రమలను, ఫాక్స్‌లింక్స్‌ తొలి యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘గురువారం తిరుపతి పర్యటన సందర్భంగా మూడు పరిశ్రమలకు శంకుస్థాపనలు చేసి, మరో మూడింటిని ప్రారంభించాం. దాదాపు రూ.4వేల కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. టీసీఎల్‌ సంస్థ ఇప్పటికే రూ.1,230 కోట్ల పెట్టుబడితో టీవీ ప్యానెళ్ల తయారీ, సెల్‌ఫోన్‌ డిస్‌ప్లే యూనిట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేసింది. దీనివల్ల 3,200 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఫాక్స్‌లింక్స్‌ సంస్థ రూ.1,050 కోట్ల పెట్టుబడితో యూఎస్‌బీ కేబుళ్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుచేసింది. దీనివల్ల 2వేల మందికి ఉపాధి లభించింది. సన్నీ ఒప్పోటెక్‌ రూ.280 కోట్ల పెట్టుబడితో సెల్‌ఫోన్‌ కెమెరా లెన్స్‌లను తయారుచేస్తోంది. ఇక్కడ 1,200 మందికి ఉపాధి వచ్చింది. ఈఎంసీ-2లో రూ.110 కోట్ల పెట్టుబడితో డిక్సన్‌ సంస్థ టీవీ తయారీ యూనిట్ల నిర్మాణాలు ప్రారంభించింది. ఇది ఏడాదిలో అందుబాటులోకి వస్తుంది. అప్పుడు 850 మందికి ఉపాధి లభిస్తుంది. ఫాక్స్‌లింక్స్‌ సంస్థ రూ.300 కోట్లతో విస్తరణ పనులు చేపడుతోంది. ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభించి 120 మందికి ఉపాధి కల్పించనుంది’ అని వివరించారు.

అపాచీ సంస్థకు భూమిపూజ

‘ఇలగనూరులో అపాచీ సంస్థ రూ.800 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ అడిడాస్‌ బూట్లు తయారవుతాయి. దాదాపు 10వేల మందికి ఉపాధి దక్కనుంది. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తడలో అపాచీ సంస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అక్కడ ఇప్పుడు 15 వేల మంది పనిచేస్తున్నారు. అందులో 60% మంది మహిళలే. ఇనగలూరులో ఏర్పాటుచేసే పరిశ్రమ 2023 సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇక్కడ 80% మహిళలకే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతంలో ఒక సరికొత్త ఉషోదయం మొదలవుతుందని ఆశిస్తున్నా’ అని సీఎం జగన్‌ వెల్లడించారు.

ఉత్పత్తుల వివరాల వెల్లడి

టీసీఎల్‌ పరిశ్రమ ప్రారంభం అనంతరం ప్లాంటు ప్రాధాన్యం గురించి టీసీఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అబెల్‌ జియాంగ్‌, ప్రతినిధులు ఎల్‌వీ లియాంగ్‌, వాజ్‌, కారీ తదితరులు ముఖ్యమంత్రికి వివరించారు. సన్నీ ఒప్పోటెక్‌ పరిశ్రమ ప్రారంభం అనంతరం ప్రాజెక్టు మేనేజర్‌ లెనిన్‌, ప్రతినిధులు గురుమూర్తి, హెచ్‌ఆర్‌ కావ్య ఉత్పత్తి తయారీ విధానం, ఆటోఫోకస్‌, జూమ్‌ తదితర ఆప్టికల్‌ కోర్‌ టెక్నాలజీతో మల్టీలేయర్‌ కోటింగ్‌ను ఎంఐ, శాంసంగ్‌, ఒప్పో, వివో వంటి సెల్‌ఫోన్‌ తయారీ సంస్థలకు చేసే ఎగుమతుల గురించి తెలియజేశారు. ఫాక్స్‌లింక్స్‌కు సంబంధించి ప్రాజెక్టు మేనేజర్‌ ప్రమోద్‌, ఐటీ మేనేజర్‌ శాంతి, మార్కో హుయాంగ్‌, సమ్మర్‌ హుయాంగ్‌లు హెచ్‌పీ ప్రింటర్ల సర్క్యూట్‌ బోర్డుల అసెంబ్లింగ్‌, యూఎస్‌బీ కేబుళ్ల తయారీ, ఉపయోగాల గురించి వెల్లడించారు. ఆ తర్వాత వర్చువల్‌ విధానంలో ఒంగోలుకు చెందిన టెక్‌బుల్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థను ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు 800 మందికి ఉపాధి కల్పించే దిశగా 20 స్టార్టప్‌లు రూ.20 కోట్ల పెట్టబడితో ప్రారంభం కానున్నాయి.

అవగాహన ఒప్పందాలు

ఈ సందర్భంగా పలు అంశాలపై పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్‌ అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఏజెన్సీతో స్మార్ట్‌ డీవీ టెక్నాలజీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.100 కోట్ల పెట్టుబడితో హైఎండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ టెక్నాలజీలో దాదాపు 3వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇంకా హైఎండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ టెక్నాలజీలో 10వేల మందికి శిక్షణ ఇవ్వనుంది. టీసీఎల్‌ కార్పొరేషన్‌కు చెందిన పీవోటీపీఎల్‌ ఎలక్ట్రానిక్స్‌ కూడా ఎంవోయూ కుదుర్చుకుంది. జెట్‌వర్క్‌ టెక్నాలజీస్‌ ఒక ఎంవోయూ కుదుర్చుకుంది. ఐటీ సేవల ఎగుమతి కోసం ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలు తెరిచేందుకు ఏపీఈఐటీఏతో టెక్‌బుల్స్‌ ఎంవోయూ చేసుకుంది.


వైభవంగా వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ

తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద నిర్మించిన వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అక్కడ తితిదే అధికారిక వృక్షం మానుసంపంగి మొక్క నాటారు. అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు తితిదే వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్య అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ మహాసంప్రోక్షణ శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అక్కడి నుంచి ప్రదక్షిణగా ఆలయంలోకి చేరుకున్న సీఎం వకుళమాతను దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి వేదపండితులు వేద ఆశీర్వాదం చేశారు. తితిదే ఈవో ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి డ్రై ఫ్లవర్‌ సాంకేతికతతో తయారుచేసిన వకుళమాత ఫొటోఫ్రేమ్‌, తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన పలువురిని సీఎం సత్కరించి బంగారు కడియాలు తొడిగారు. కార్యక్రమాల్లో మంత్రులు కె.నారాయణస్వామి, ఆర్‌కే రోజా, గుడివాడ అమర్నాథ్‌, కొట్టు సత్యనారాయణ, ఎంపీలు మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని