‘దుల్హన్‌’కు డబ్బుల్లేవ్‌

ముస్లిం యువతులు, మహిళలకు ఉద్దేశించిన ‘దుల్హన్‌’ పథకాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిపేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆ మేరకు సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ) కోర్టుకు నివేదించడంతో.. ధర్మాసనం

Published : 24 Jun 2022 02:42 IST

ఆర్థిక ఇబ్బందుల వల్ల నిలిపేస్తున్నాం  
హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ముస్లిం యువతులు, మహిళలకు ఉద్దేశించిన ‘దుల్హన్‌’ పథకాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిలిపేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆ మేరకు సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ) కోర్టుకు నివేదించడంతో.. ధర్మాసనం స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. వివాహ సమయంలో ముస్లిం యువతులకు, అలాగే వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు 2015లో అప్పటి ప్రభుత్వం దుల్హన్‌ పథకాన్ని ప్రవేశపెట్టిందని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేసిందని, దానిని అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్‌ ఫారూఖ్‌ షిబ్లీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పథకం కింద అందిస్తున్న రూ.50 వేలను రూ.లక్షకు పెంచుతామని ఎన్నికల ముందు వైకాపా హామీ ఇచ్చిందని చెప్పారు. ఆ మాటలను నమ్మి ఎంతో మంది ముస్లిం మైనార్టీలు ఆ పార్టీకి ఓట్లు వేశారన్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ వాగ్దానాన్ని పూర్తిగా మరిచిపోవడమే కాకుండా అసలు ఉన్న పథకాన్నే నిలిపివేసిందని తెలిపారు. ఇది ఓటర్లను మోసం చేయడమేనని ఆరోపించారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది మహ్మద్‌ సలీం పాషా వాదనలు వినిపిస్తూ.. ఈ పథక ప్రయోజనాలను పెంచుతామని చెప్పిన వైకాపా దానిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ సందర్భంగా ఏజీపీ స్పందిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ పథకం అమలును ఆపేసినట్లు ఎవరు సమాచారం ఇచ్చారని ప్రశ్నించింది. సంబంధిత అధికారులు తెలియజేశారని చెప్పారు. ఆ వివరాలను అఫిడవిట్‌ రూపంలో తెలియజేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను జులై 7కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని