ఆన్‌లైన్‌ విచారణ సాధ్యమా?

ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ఆన్‌లైన్‌ ద్వారా విచారణ సాధ్యమా? కానిపక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వొకేట్‌

Published : 24 Jun 2022 02:42 IST

కాకపోతే ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించండి
ఎంపీ రఘురామ విషయంలో సీఐడీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసులో ఆన్‌లైన్‌ ద్వారా విచారణ సాధ్యమా? కానిపక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. వివరాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌కు సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఏపీ సీఐడీ తనపై సుమోటోగా దేశద్రోహం(ఐపీసీ సెక్షన్‌ 124ఏ)తో పాటు, రెండు సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం(153 ఏ), 505, 120బి సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. దేశద్రోహం(124ఏ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో మిగిలిన సెక్షన్ల విషయంలో ఎంపీని విచారించేందుకు అనుమతించాలన్నారు. ఇతర సెక్షన్ల విషయంలో విచారణ కొనసాగించుకోవచ్చని 124ఏ నిలుపుదల సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. మరోవైపు పిటిషనర్‌కు బెయిలు మంజూరు సమయంలో దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఎంపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సీఐడీ పోలీసులు ఎంపీని హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్‌ చేసి ఏపీకి తరలించారు. దర్యాప్తు పేరుతో దారుణంగా కొట్టారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో సీఐడీ పిలిచిన చోటుకి విచారణ నిమిత్తం ఎంపీ వెళ్లడం శ్రేయస్కరం కాదు. మరోసారి దాడి చేసే అవకాశం లేకపోలేదు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. ఆన్‌లైన్‌ ద్వారా లేదా హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో విచారణ చేసేందుకు అభ్యంతరం లేదు. విచారణకు ఎంపీ సహకరిస్తారు’ అని చెప్పారు. ఆ అభ్యర్థనపై ఏజీ అభ్యంతరం తెలిపారు.. ‘అరెస్ట్‌ సందర్భంగా హైదరాబాద్‌లో పిటిషనర్‌ ఇంటికెళ్లిన సీఐడీ అధికారులను కాల్చాలని ఎంపీ తన భద్రత సిబ్బందిని ఆదేశించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మీడియా సంస్థల ప్రతినిధులనూ ఎంపీతో కలిపి విచారించాల్సి ఉంది. అందరినీ కలిపి విచారిస్తేనే వాస్తవాలను బయటకు తీయగలుగుతాం. ఎంపీ ఇంటికెళ్లి విచారణ చేయడం సరికాదు. విచారణ సమయంలో వీడియో రికార్డు చేస్తారు. ఎంపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఏజీ తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇరువర్గాల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం న్యాయస్థానంపై ఉందన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విచారణ సాధ్యమా? కానిపక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని