చిత్తూరు మాజీ మేయర్‌ హేమలతపైకి పోలీసు జీపు!

చిత్తూరులో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. రాత్రి 11 గంటల సమయంలో స్థానిక సంతపేటలోని మాజీ మేయర్‌, తెదేపా నగర అధ్యక్షురాలు కఠారి హేమలత అనుచరుడైన పూర్ణ ఇంటికి వచ్చిన పోలీసులు మీ ఇంట్లో

Updated : 24 Jun 2022 06:48 IST

గాయపడిన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
తెదేపా నేతల ఇళ్లలో గంజాయి ఉందంటూ పోలీసుల సోదాలు
నిరసిస్తూ బైఠాయించగా ఘటన  

చిత్తూరు (క్రైమ్‌), న్యూస్‌టుడే: చిత్తూరులో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. రాత్రి 11 గంటల సమయంలో స్థానిక సంతపేటలోని మాజీ మేయర్‌, తెదేపా నగర అధ్యక్షురాలు కఠారి హేమలత అనుచరుడైన పూర్ణ ఇంటికి వచ్చిన పోలీసులు మీ ఇంట్లో గంజాయి ఉందంటూ సోదా చేశారు. తన దగ్గర అలాంటిదేమీ లేదని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ పూర్ణ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన హేమలత తన అనుచరులతో కలిసి పోలీసు జీపు వెనుక బైఠాయించారు. అయినా జీపును రివర్స్‌ చేసి పోనివ్వమని సీఐ ఆదేశించారని, దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లిపోయిందని ఆమె అనుచరులు ఆరోపించారు. గాయపడిన హేమలతను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తన అత్తమామలైన దివంగత మేయర్‌ కఠారి అనూరాధ, మోహన్‌ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారంటూ హేమలత సాయంత్రం ఏఎస్పీ జగదీష్‌కు వినతిపత్రం సమర్పించి, విలేకర్లతో మాట్లాడారు. కొద్ది గంటల్లోనే ఈ నాటకీయ పరిణామాలు చకచకా చోటుచేసుకోవడం గమనార్హం.  

గంజాయి బస్తాలను పెట్టబోయారు!

మేయర్‌ దంపతుల హత్య కేసులో హేమలత అనుచరుడు ప్రసన్న సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రసన్న తమ్ముడు పూర్ణను గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నాడంటూ చిత్తూరు టూటౌన్‌ పోలీసులు రాత్రి 8 గంటలకు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తెదేపా నేతలు వెళ్లి ఆధారాలు చూపాలని అడగ్గా, అతడిని సంతపేటలోని ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే పోలీసులు వారి దగ్గరున్న గంజాయి బస్తాలను ఇంట్లో పెట్టేందుకు ప్రయత్నించగా తాము అడ్డుకున్నట్లు పూర్ణ తల్లి, వదిన చెబుతున్నారు. దీంతో ఓబనపల్లెలో తమకున్న మరో ఇంట్లో ఒక గంజాయి బస్తా పెట్టేశారని ఆరోపిస్తున్నారు. తమ ఇంట్లో గంజాయి పెట్టి అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని పూర్ణ ఆందోళనకు దిగారు. హేమలత, పలువురు తెదేపా నాయకులు అక్కడకు వచ్చి.. ఆ బస్తాల్లో ఏముందో చూపాలని పోలీసులను అడిగారు. అవన్నీ చూపించడం కుదరదంటూ పూర్ణను మళ్లీ జీపులో ఎక్కించారు. అతణ్ని కిందికి దించాలంటూ హేమలత, నేతలు జీపు వెనుక వైపునకు వెళ్లి అడ్డుగా కూర్చున్నారు. జీపును రివర్స్‌ చేసే క్రమంలో హేమలత కాళ్లపై నుంచి వెళ్లిపోయింది. గాయపడిన ఆమెను హుటాహుటిన నేతలు, అనుచరులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు కాళ్ల ఎముకల్లో స్వల్పంగా పగుళ్లు వచ్చినట్లు వైద్యులు చెప్పారు. హేమలతకు కడుపులో నొప్పిగా ఉందనడంతో రాత్రి ఒంటి గంట సమయంలో అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ తీశారు. వైద్యుల నిర్ణయాన్ని బట్టి వేలూరు సీఎంసీకి తరలించే అవకాశం ఉంది.

తగలకపోయినా ఎక్కించామంటున్నారు: సీఐ

పూర్ణ ఇంట్లో సోదాలు చేయగా తమకు గంజాయి లభించిందని చిత్తూరు టూటౌన్‌ సీఐ యతీంద్ర చెప్పారు. తెదేపా నేతలు జీపునకు అడ్డుగా ఉన్నారని, వారికి వాహనం తగలకపోయినా ఎక్కించామని ఆరోపిస్తున్నారన్నారు.


హత్య కేసు నీరుగార్చేందుకే పోలీసుల కుట్ర

దివంగత మేయర్‌ కఠారి అనూరాధ, మోహన్‌ హత్య కేసును నీరుగార్చేందుకే పోలీసులు కుట్ర పన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే గంజాయి అక్రమ రవాణా అంటూ కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆరా తీశారు. హేమలతకు అండగా నిలవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని