ఎంపీపీ భర్త నెలకు రూ.లక్ష అడుగుతున్నారు

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో... లంచాలు, అవినీతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల మధ్య వాగ్వాదం, నిలదీతలు

Updated : 24 Jun 2022 08:24 IST

నేనెక్కడి నుంచి తెచ్చేదన్న ఎంపీడీవో
ఎంపీడీవో దొంగ బిల్లులు పెడుతున్నారన్న ఎంపీపీ
మార్కాపురం మండల పరిషత్‌లో బహిర్గతమైన లంచాల బాగోతం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో... లంచాలు, అవినీతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల మధ్య వాగ్వాదం, నిలదీతలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ పోరెడ్డి అరుణ మాట్లాడుతూ... ఎంపీడీవో టి.హనుమంతరావు అవినీతికి పాల్పడుతున్నారని, సంబంధిత చిట్టాను పేపరులో రాసుకొచ్చి మరీ సభ్యులకు చదివి వినిపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిధుల సమాచారమూ ఇవ్వడం లేదన్నారు. అన్నీ దొంగ బిల్లులు చేసుకొని ప్రతినెలా రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు డ్రా చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కార్యాలయాన్ని లంచాలమయంగా మార్చేశారని మండిపడ్డారు. వాలంటీర్లను నియమిస్తే రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు లంచం తీసుకుంటున్నారని, ఉద్యోగులు, పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి ముందుగానే రూ.35 వేలను ఆయనకు అందజేస్తేనే బిల్లులు డ్రా చేస్తారని ఆరోపించారు. దీనికి స్పందించిన ఎంపీడీవో... మీ భర్త చెంచిరెడ్డి ప్రతినెలా రూ.లక్ష వరకు ఇవ్వాలని అంటున్నారని, మండల పరిషత్తుకు ఏడాదికి వచ్చే జనరల్‌ ఫండ్‌ రూ.10 లక్షలేనని, ఆయన కోసం తాను ప్రతినెలా రూ.లక్ష ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. వెంటనే ఎంపీపీ, ఆమె భర్త ఇద్దరూ కలిసి ఎంపీడీవోతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఏడు గ్రామాల్లోని 8 మందికే పరిహారమా?

గజ్జలకొండ పంచాయతీలో ఏడు గ్రామాలకు చెందిన 800 మంది రైతులుంటే కేవలం ఎనిమిది మందికే పంట నష్ట పరిహారం రావడం ఏమిటని వ్యవసాయాధికారిని సభ్యులు ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈని సైతం సభ్యులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళం మధ్య సభను ముగిస్తున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. మరోవైపు సర్వసభ్య సమావేశానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచుల స్థానంలో వారి భర్తలు, కుటుంబ సభ్యులు వచ్చి, దర్జాగా చర్చల్లోనూ పాల్గొనడం గమనార్హం. ఆరుగురు మహిళా ఎంపీటీసీ సభ్యులుండగా ఒక్కరు కూడా రాలేదు. ఆరుగురు మహిళా సర్పంచులకు ముగ్గురే వచ్చారు. కొందరు పురుష ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులకు బదులు వారి బంధువులు హాజరైనా ఎవ్వరూ పట్టించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని