రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయండి

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో మరో కొత్త సమస్య తలెత్తింది. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తేనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2021-22

Published : 24 Jun 2022 04:18 IST

తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులిస్తామని కేంద్రం మెలిక

ఈనాడు, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో మరో కొత్త సమస్య తలెత్తింది. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తేనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2021-22 సంవత్సరానికి రెండో విడతగా 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రూ.965.50 కోట్లు రావాల్సి ఉంది. ఆర్థిక సంఘం ఇదివరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు అనుసంధానించి... రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద కూడా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పేరిట రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను తెరిపించింది. అనంతరం ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురు చూస్తున్న దశలో కేంద్రం... రాష్ట్ర ఆర్థిక సంఘం అంశాన్ని తెరపైకి తెచ్చింది. వైకాపా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఐదో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నాలుగో రాష్ట్ర ఆర్థిక సంఘం మూడేళ్ల పదవీ కాలం ముగియడం... గవర్నర్‌కు నివేదిక ఇవ్వడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని కేంద్రం ప్రస్తావించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు తప్పనిసరని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఏర్పాటుకు కనీసం నోటిఫికేషన్‌ అయినా ఇస్తే... నిధుల విడుదల విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని