కిదాంబి, షేక్‌ జాఫ్రిన్‌లకు సీఎం అభినందన

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అభినందించారు. బ్యాంకాక్‌లో ఇటీవల జరిగిన థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన కిదాంబి శ్రీకాంత్‌, బదిరుల ఒలింపిక్స్‌లో కాంస్య...

Published : 25 Jun 2022 04:25 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులు కిదాంబి శ్రీకాంత్‌, షేక్‌ జాఫ్రిన్‌లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అభినందించారు. బ్యాంకాక్‌లో ఇటీవల జరిగిన థామస్‌ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన కిదాంబి శ్రీకాంత్‌, బదిరుల ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన కర్నూలుకు చెందిన షేక్‌ జాఫ్రిన్‌లు అంతర్జాతీయ వేదికలపై ఏపీ ప్రతిష్ఠను ఎలుగెత్తి చాటారని పేర్కొన్నారు. ఇద్దరు క్రీడాకారులను సన్మానించారు. షేక్‌ జాఫ్రిన్‌కు అర్హతలు బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరఫున అధ్యక్షుడు ద్వారకానాథ్‌ బ్యాడ్మింటన్‌ కిట్‌ను సీఎం జగన్‌కు అందజేశారు.

త్రోబాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌కు రూ.25 లక్షల ఆర్థికసాయం

భారత త్రోబాల్‌ జట్టు కెప్టెన్‌ చావలి సునీల్‌కు రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. రాష్ట్ర సచివాలయంలో క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా రూ.25 లక్షల చెక్కును సునీల్‌కు అందజేశారు. తెనాలి సమీపంలోని కొల్లిపరలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సునీల్‌ క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించి ఆంధ్రప్రదేశ్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం గర్వకారణమని ఈ సందర్భంగా మంత్రి రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహకాలు కల్పించి వారి అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సీఎంకు, మంత్రికి త్రోబాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసంబంధాల శాఖ ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు