వైకాపా కార్యాలయానికి భూమి కేటాయింపుపై పిల్‌

చంద్రగిరిలో వైకాపా కార్యాలయం ఏర్పాటుకు రెండెకరాల ప్రభుత్వ భూమి కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వైకాపా అధ్యక్షుడు, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, తిరుపతి కలెక్టర్‌,

Published : 25 Jun 2022 04:25 IST

చంద్రగిరి తహసీల్దారు, రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా అధ్యక్షుడికి నోటీసులు
యథాతథ స్థితి ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
తెదేపా కార్యాలయ స్థలంపై దాఖలైన పిల్‌తో జతచేయాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: చంద్రగిరిలో వైకాపా కార్యాలయం ఏర్పాటుకు రెండెకరాల ప్రభుత్వ భూమి కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వైకాపా అధ్యక్షుడు, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, తిరుపతి కలెక్టర్‌, తుడా ఛైర్మన్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, చంద్రగిరి తహసీల్దారు, చంద్రగిరి గ్రామ సర్పంచ్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో తెదేపా కార్యాలయం భూమి విషయంలో గతంలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తిరుపతి జిల్లా చంద్రగిరి గ్రామ పరిధిలో వైకాపా కార్యాలయం ఏర్పాటు కోసం రెండెకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం మే 18న ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ చంద్రగిరికి చెందిన గౌస్‌ బాషా హైకోర్టులో పిల్‌ వేశారు. న్యాయవాది ఎం.రాహుల్‌ వాదనలు వినిపిస్తూ.. భూ కేటాయింపుల విధానానికి విరుద్ధంగా వైకాపాకు రెండెకరాలు కేటాయించారన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌ ఏ పార్టీవారని ప్రశ్నించింది. తెదేపాకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడని న్యాయవాది బదులిచ్చారు. తెదేపా హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రశ్నించగా.. గతంలో ఓ విధానం ఉందని, దాని ప్రకారం కేటాయించారని న్యాయవాది బదులిచ్చారు. ఆ విధానానికి విరుద్ధంగా నిషేధిత జాబితాలోని భూమిని వైకాపా కార్యాలయం కోసం కేటాయించారన్నారు. రాజకీయ పార్టీకి భూమి కేటాయించడం అంటే ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినట్లేనన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. రాజకీయ నాయకులు సామాజిక సేవ చేస్తున్నామని చెప్పుకొంటారు కాబట్టి.. వారి పార్టీ కార్యాలయాలకు భూమి కేటాయిస్తే ప్రైవేటు వ్యక్తులకు కేటాయించినట్లు భావించాల్సిన అవసరం లేదంది. ప్రభుత్వం తరఫున న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆత్మకూరులో తెదేపా కార్యాలయం ఏర్పాటుచేసిన స్థలంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యం సుప్రీంకోర్టు వరకు వెళ్లి... తిరిగి హైకోర్టుకు వచ్చిందని గుర్తుచేశారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్‌ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని