సీడ్స్‌ ఉదంతంపై అంతా రహస్యమే!

అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో విషవాయువు ప్రమాదంపై కారణాలు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీల నివేదికలు బుట్ట దాఖలైనట్లే కనిపిస్తోంది. ప్రమాద కారణాలు వారం రోజుల్లో వెల్లడిస్తామని పరిశ్రమల....

Published : 25 Jun 2022 04:25 IST

నివేదికలు బుట్టదాఖలేనా?
‘పోరస్‌’లో ఉత్పత్తులు ప్రారంభం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్‌ దుస్తుల తయారీ పరిశ్రమలో విషవాయువు ప్రమాదంపై కారణాలు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీల నివేదికలు బుట్ట దాఖలైనట్లే కనిపిస్తోంది. ప్రమాద కారణాలు వారం రోజుల్లో వెల్లడిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రకటించినా ఫలితం లేదు. అనకాపల్లి జిల్లా బ్రాండిక్స్‌ అపెరల్‌ సిటీ పరిధిలోని సీడ్స్‌ దుస్తుల పరిశ్రమలో పనిచేస్తున్న 436 మంది మహిళా కార్మికులు విషవాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకుని 22 రోజులు గడుస్తోంది. ప్రమాదం జరగ్గానే మంత్రి అమర్‌నాథ్‌ ఆదేశాలతో జిల్లా సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)తో కలిసి పరిశీలించి తమ నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందించినట్లు ప్రకటించారు. ఈ నివేదికల్లో ఏముందో బహిర్గతం కాలేదు. ప్రమాదానికి కారణమని భావించి ఉత్పత్తులు ఆపేసిన పోరస్‌ ల్యాబొరేటరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ప్రారంభించేలా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వారం క్రితమే ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన సీడ్స్‌ కంపెనీలోనూ యథావిధిగా ఉత్పత్తులు కొనసాగుతున్నాయి. సీడ్స్‌ దుర్ఘటనపై కలెక్టర్‌కు నివేదిక అందించామని, ఆయనే వివరాలు వెల్లడిస్తారని పీసీబీ ఈఈ ప్రమోద్‌కుమార్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. 17వ తేదీ నుంచి పోరస్‌ ల్యాబొరేటరీలో ఉత్పత్తులు కొనసాగించడానికి ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. సీడ్స్‌ కంపెనీలో ఉత్పత్తులను పీసీబీ నిలుపుదల చేయలేదని, కలెక్టర్‌ ఆదేశాలతో కొద్దిరోజులు ఆపారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని