ఇక ‘వృత్తిపన్ను’పై ప్రభుత్వం దృష్టి

ఇన్నాళ్లూ చెల్లించనివారి నుంచి వృత్తిపన్ను వసూలుచేసేందుకు జీఎస్టీ అధికారులు సిద్ధమయ్యారు. పన్ను చెల్లించాలని నోటీసులు వస్తుండటంతో.. అందుకున్నవారు కంగు తింటున్నారు.

Published : 25 Jun 2022 04:25 IST

రూ.140 కోట్ల వసూళ్లకు ప్రణాళికలు

ఈనాడు, అమరావతి: ఇన్నాళ్లూ చెల్లించనివారి నుంచి వృత్తిపన్ను వసూలుచేసేందుకు జీఎస్టీ అధికారులు సిద్ధమయ్యారు. పన్ను చెల్లించాలని నోటీసులు వస్తుండటంతో.. అందుకున్నవారు కంగు తింటున్నారు. ఇప్పటివరకు జీఎస్టీ రికార్డుల్లోకి రాని 21 విభాగాలకు చెందిన లక్షన్నర మంది వివరాలు విజయవాడలోని జీఎస్టీ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాల్లోని సర్కిళ్ల కార్యాలయాలకు వెళ్తున్నాయి. వృత్తిలోకి ప్రవేశించి లేదా వైద్యవిద్య సంస్థలను ఏర్పాటుచేసి ఐదేళ్లు దాటినవారు తప్పనిసరిగా ఏడాదికి రూ.2,500 వృత్తిపన్ను చెల్లించాలి. కొందరు 10, 15 ఏళ్లుగా ఇది చెల్లించట్లేదు. వీరిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జీఎస్టీ అధికారులు తొలివిడత 2018 నుంచి 2021 మధ్య వృత్తిపన్ను చెల్లించాల్సిన వారి జాబితాను సేకరిస్తే 1.50 లక్షల మంది ఉన్నారని తేలింది. నాలుగేళ్లకు కలిపి రూ.140 కోట్లు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వీరందరికీ పన్ను చెల్లించాలని ‘అత్యవసర’ నోటీసులు జారీ అవుతున్నాయి. వీటిని అందుకునే వారిలో న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులు, ప్రైవేటు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల ఉద్యోగులు ఉన్నారు. సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించేవారూ వ్యక్తిగతంగానే కాకుండా సంస్థ తరఫున కూడా వృత్తిపన్ను చెల్లించాలి. వృత్తిపన్నుపై పునరాలోచన చేయాలని నెల్లూరులో బార్‌ కౌన్సిల్‌ వారు గత వారం ఆందోళన చేశారు. పన్ను చెల్లించాల్సిన వారిలో న్యాయవాదులు 60వేలు, దంత వైద్యులు 12వేలు, వైద్యులు 22వేల చొప్పున ఉన్నట్లు తెలిసింది. దేవాలయాల పరిసరాల్లో వ్యాపారాల కోసం లైసెన్సులు, రెన్యువల్‌్్స మంజూరు చేయాలంటే... సంబంధితులు వృత్తిపన్ను చెల్లించి ఉండాలని దేవాదాయ శాఖ శుక్రవారం గెజిట్‌ జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని