జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు పవన్‌కల్యాణ్‌ తల్లి రూ.1.50 లక్షల విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తల్లి అంజనాదేవి ఆ పార్టీ తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు రూ.1.50 లక్షలు, పార్టీకి రూ.లక్ష విరాళమిచ్చారు. పవన్‌కల్యాణ్‌ తండ్రి వెంకట్రావు జయంతిని పురస్కరించుకుని....

Published : 26 Jun 2022 05:13 IST

పార్టీకి మరో రూ.లక్ష అందజేత

ఈనాడు, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తల్లి అంజనాదేవి ఆ పార్టీ తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు రూ.1.50 లక్షలు, పార్టీకి రూ.లక్ష విరాళమిచ్చారు. పవన్‌కల్యాణ్‌ తండ్రి వెంకట్రావు జయంతిని పురస్కరించుకుని శనివారం ఆమె హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్‌కు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ...‘‘మా నాన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. 2007లో ఆయన మరణించారు. అప్పటి నుంచి పింఛను డబ్బులు మా అమ్మకు వస్తున్నాయి. వాటిని దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వటం అమ్మకు అలవాటు. ఇప్పుడు ఆ డబ్బును పెద్ద దిక్కు కోల్పోయిన రైతు కుటుంబాల్ని ఆదుకోవటం కోసం అమ్మ ఇవ్వటం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ‘‘సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయటం కోసం మా వంతు ప్రయత్నిస్తాం. పాత పింఛను విధానం అనేది మా కుటుంబానికి భావోద్వేగంతో కూడిన అంశం. ఉద్యోగులకు అండగా ఉంటాం’’ అని పవన్‌కల్యాణ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆయన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీతో సమావేశమయ్యారు. పార్టీ సభలు, కార్యక్రమాలకు అనుసరించాల్సిన ప్రణాళికలపై దిశా నిర్దేశం చేశారు.

* అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఏపీని విముక్తి చేయటానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రాభివృద్ధికి జనసేన వద్ద వినూత్న ప్రణాళికలు ఉన్నాయి. పవన్‌కల్యాణ్‌ సీఎం అయితే నేనూ ఒక కార్యకర్తగా పనిచేస్తా’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని