అనుచిత వ్యాఖ్యలు చేసిన.. రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇస్తాం

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై అభ్యంతరకర ట్వీట్‌ చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు ఇస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Published : 26 Jun 2022 05:13 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ఈనాడు, దిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై అభ్యంతరకర ట్వీట్‌ చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు ఇస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ‘‘మానవ అక్రమ రవాణా’’పై దిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌, బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. అనంతరం వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడుతూ.. వర్మ తన ట్వీట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. మహిళల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతోందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యచరణ ప్రణాళికను జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మకు నివేదించినట్లు ఆమె తెలిపారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి పోలీసు శాఖ సమన్వయంతో మహిళా కమిషన్‌ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆమె వెంట కమిషన్‌ రాష్ట్ర కార్యదర్శి వై.శైలజ ఉన్నారు.

పురపాలక బడుల పర్యవేక్షణ బాధ్యతలు బదిలీ

ఈనాడు, అమరావతి: పురపాలక పాఠశాలల పరిపాలన బాధ్యతలను చేపట్టాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పురపాలక పాఠశాలల పర్యవేక్షణ, పరిపాలన బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్‌ స్కూళ్లలోని బోధనేతర సిబ్బందిని పాఠశాల విద్యాశాఖలోకి తీసుకొని, కొనసాగించాలని సూచించింది. బోధన సిబ్బందికి ప్రత్యేక సర్వీసు నిబంధనలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆయా బడుల స్థిర, చర ఆస్తులు పురపాలక సంఘాల ఆధ్వర్యంలోనే ఉంటాయని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని