ఫోరెన్సిక్‌ నివేదికకు మూడేళ్లా?

వైద్య విద్యనభ్యసిస్తున్న తన కుమారుడి మృతికి సంబంధించి ఓ తల్లి నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తే, పోలీసులు ఆ కోణాల్లో విచారించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదిక తెప్పించుకోవడంలో ఆలస్యంపై ఆగ్రహించింది.

Published : 26 Jun 2022 05:17 IST

ఆధారాలిచ్చినా దర్యాప్తులో పురోగతి ఏది?
మెడికో మృతికేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం
సమర్థుడైన డీఎస్పీకి అప్పగించాలని డీజీపీకి ఆదేశం

ఈనాడు, అమరావతి: వైద్య విద్యనభ్యసిస్తున్న తన కుమారుడి మృతికి సంబంధించి ఓ తల్లి నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తే, పోలీసులు ఆ కోణాల్లో విచారించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. డీజీపీ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదిక తెప్పించుకోవడంలో ఆలస్యంపై ఆగ్రహించింది. నెల రోజుల్లోగా కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని, డీఎస్పీ హోదా గల అధికారితో ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయించాలని డీజీపీని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ఈ నెల 20న ఆదేశాలిచ్చారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు వైద్య కళాశాలలో చదువుకుంటున్న పుష్పక్‌నాయక్‌ 2019 జులై 29న అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటనపై అప్పట్లో ఏలూరు గ్రామీణ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మృతుడి తల్లి గుగులోతు వరలక్ష్మి 2021 జనవరిలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీఎస్‌పీ సురేశ్‌కుమార్‌ వాదిస్తూ.. ‘పుష్పక్‌ నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న పోలీసుల వాదన సరికాదు. కులం పేరుతో వేధింపులు, ర్యాగింగ్‌ జరిగాయి. ఆత్మహత్యకు ఆనవాళ్లు లేవు. మృతుడి కాల్‌డేటా, అనుమానితుల ఫోన్‌ నంబర్లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పోలీసులకు ఇచ్చినా ఆ కోణాల్లో దర్యాప్తు చేయలేదు. మృతికి కారకులైన వ్యక్తులకు పోలీసులు రక్షణగా నిలుస్తున్నార’ని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, ‘ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి నివేదిక రావాల్సి ఉంది. పుష్పక్‌ పరీక్షల్లో ఫెయిలై కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. సీబీఐ న్యాయవాది కల్పించుకొని, అవినీతి కేసుల దర్యాప్తుతో సీబీఐపై పనిభారం అధికంగా ఉందని, ప్రస్తుత కేసు విచారించలేదని చెప్పారు.

చట్టబద్ధ దర్యాప్తు బాధ్యత పోలీసులదే

ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ‘ఘటన 2019 జులై 29న జరిగితే, ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడు పుష్పక్‌ కాల్‌డేటా అవసరమని దర్యాప్తు అధికారి 2019 జులై 30న కేసు డైరీలో రాశారు. మృతుడి సెల్‌ఫోన్‌ను అప్పుడే మంగళగిరి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామన్నారు. ఇప్పటికీ ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం అంటున్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి, దర్యాప్తు అధికారి కార్యాలయానికి ఈ ల్యాబ్‌ ఎంతో దూరంలో లేదు. నివేదిక తెప్పించుకోవడానికి పోలీసులకు ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు పడుతోంది? మృతుడి తల్లి 13 ఫోన్‌నంబర్లు ఇవ్వగా, వాటి ఆధారంగా చేపట్టిన దర్యాప్తు వివరాలేవీ కేసు డైరీలో లేవు. తమ కుమారుడిని సీనియర్లు ర్యాగింగ్‌ చేశారని, కులం పేరుతో దూషించారని చేసిన ఆరోపణలనూ తేల్చలేదు. డబ్బు లావాదేవీల బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, విమాన ప్రయాణ టికెట్లు ఇచ్చినా వాటి ఆధారంగా పరిశోధించలేదు. నేరం జరిగినప్పుడు అన్ని కోణాల్లో విచారించాల్సిన నైతిక, చట్టబద్ధ బాధ్యత పోలీసులదే. బిడ్డను కోల్పోయిన బాధతో తల్లి కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి ఉండొచ్చు. కాని నిర్ధిష్టమైన ఆరోపణలపైనా పోలీసుల క్రియాశీలంగా స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దర్యాప్తులో జాప్యం/ముగింపు పలకపోవడం అధికరణ 21ను ఉల్లంఘించడమే’నని పేర్కొన్నారు. ఇకపై ఈ కేసును సమర్థుడైన డీఎస్పీ లేదా ఆ పైస్థాయి ర్యాంకు గల అధికారికి అప్పగించాలని, ఆరు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయించాలని డీజీపీని ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. దర్యాప్తు అధికారికి మరే ఇతర విధులు కేటాయించవద్దని, ఇలాంటి జాప్యం పునరావృతం కారాదని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని