వైకాపా గూండాల్ని కాపాడేందుకు సాక్షుల్ని బెదిరిస్తున్నారు

రాష్ట్రంలో వివిధ నేరాలకు పాల్పడుతున్న వైకాపా గూండాలు, నాయకులు, వారి అనుచరులకు కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని, వారిని కాపాడేందుకు ఆయా కేసుల్లో సాక్షుల్ని వేధిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Updated : 26 Jun 2022 06:44 IST

ఆ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోండి
డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వివిధ నేరాలకు పాల్పడుతున్న వైకాపా గూండాలు, నాయకులు, వారి అనుచరులకు కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని, వారిని కాపాడేందుకు ఆయా కేసుల్లో సాక్షుల్ని వేధిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి ఆయన శనివారం లేఖ రాశారు. చిత్తూరులో మాజీ మేయర్‌ కఠారి హేమలతపై దాడికి పాల్పడి, ఆమె కాళ్ల మీద నుంచి జీపు పోనిచ్చిన పోలీసులపై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండు చేశారు. ముఖ్యమైన కేసుల్ని నీరుగార్చేందుకు సాక్షుల్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడే ధోరణి కొనసాగితే పోలీసు వ్యవస్థ అపహాస్యం పాలవుతుందని, ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పవని హెచ్చరించారు. ‘వివిధ కేసుల్లో కీలక సాక్షుల్ని, వారి అనుచరుల్ని పోలీసులు లక్ష్యంగా చేసుకుని వేధించడం విస్తుగొలుపుతోంది. చిత్తూరులో పూర్ణ అనే వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడిచేసి తప్పుడు కేసు పెట్టడం, దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన మాజీ మేయర్‌ హేమలత కాళ్లపై నుంచి జీపు పోనివ్వడం తీవ్రస్థాయిలో ఖండించాల్సిన చర్య. మాజీ మేయర్‌ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్యకేసులో సాక్షులకు భద్రత పెంచాలని, జాప్యం లేకుండా కేసును కొలిక్కి తేవాలని హేమలత మరదలు లావణ్య ఈ నెల 22న చిత్తూరు అదనపు ఎస్పీ జగదీష్‌కి, డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఆ కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్‌ నాయుడి గురించి ఈ నెల 23న టూ టౌన్‌ పోలీసులు వాకబు చేశారు. సతీష్‌ ఎక్కడున్నాడో చెప్పాలంటూ... హేమలత అనుచరుడైన ప్రసన్నను బెదిరించారు. అదే రోజు రాత్రి 9 గంటలకు ప్రసన్న తమ్ముడు పూర్ణ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ప్రసన్నను బెదిరించి సతీష్‌ వివరాలు తెలుసుకోవడమే వారి లక్ష్యం. పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ ఆయనపై తప్పుడు కేసు పెట్టారు. పోలీసులే జీపులో పచ్చగడ్డి పెట్టి... దాన్ని పూర్ణ ఇంటినుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిగా చూపిస్తున్నారు. పూర్ణను కాపాడేందుకు అక్కడికి వచ్చిన హేమలతను సీఐ యతీంద్ర నెట్టేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పూర్ణను బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు, జీపును రివర్స్‌ చేసే క్రమంలో హేమలత కాళ్లపై నుంచి పోనిచ్చారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని ఆ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.  తప్పు చేసిన పోలీసుల్ని కఠినంగా శిక్షించి, పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని డీజీపీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.


6 నుంచి రాయలసీమలో చంద్రబాబు పర్యటన

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు జులై 6, 7, 8 తేదీల్లో రాయలసీమలో పర్యటించనున్నారు. 6న అన్నమయ్య జిల్లా మదనపల్ల్లెలో జరిగే మినీ మహానాడులో పాల్గొంటారు. 7న రాయచోటి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలపై పీలేరులో సమీక్ష నిర్వహిస్తారు. 8న చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నగరి, జీడీ నెల్లూరు శాసనసభ నియోజకవర్గాల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని