ప్రభుత్వం మారి.. పర్యాటకం ఎడారి!

ఆధ్యాత్మికత ఉట్టిపడే వేంకటేశ్వరస్వామి దేవాలయం.. ఆహ్లాదం పంచే జలాశయం.. చుట్టూ పచ్చదనం.. ఇదీ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ రిజర్వాయర్‌ పరిసరాలు.

Published : 26 Jun 2022 05:17 IST

ఆధ్యాత్మికత ఉట్టిపడే వేంకటేశ్వరస్వామి దేవాలయం.. ఆహ్లాదం పంచే జలాశయం.. చుట్టూ పచ్చదనం.. ఇదీ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ రిజర్వాయర్‌ పరిసరాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం భావించింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో రూ.2.4 కోట్లతో పనులు చేపట్టింది. కాటేజీలు, క్యాంటీన్‌, వ్యూ పాయింట్‌, ఈత కొలను, ఉద్యానాలు ఏర్పాటు చేసింది. వీటిని ప్రారంభించే లోపే ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనపెట్టింది. నిర్మాణాలకు సంబంధించిన బిల్లులూ ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. మరోవైపు అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు నిరుపయోగంగా మారాయి. విద్యుత్తు పరికరాలు దొంగల పాలవుతున్నాయి. కాటేజీల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. చుట్టూ పొదలు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. వీటిని అధికార పార్టీ నాయకుడు నామినేషన్‌ పద్ధతిలో దక్కించుకోవాలని పర్యాటకశాఖపై ఒత్తిడి తెచ్చారు. అలా వీలుకాదని పర్యాటకశాఖ టెండర్లు పిలిచింది. అందులోనూ ఆ నాయకుడు ఒక్కరే టెండరు వేయడంతో దాన్ని రద్దు చేసింది. మళ్లీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ఫలితంగా రూ.కోట్ల విలువైన నిర్మాణాలు ప్రారంభించక ముందే శిథిలమవుతున్నాయి.

- ఈనాడు, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని