Published : 27 Jun 2022 02:52 IST

మనమంటే అందరికీ చులకనే..

అందుకే పథకాలకు కోతలు పెడుతున్నారు

రాజకీయాలకు అతీతంగా అంతా ఏకమవుదాం

గుంటూరులో జరిగిన ముస్లింల ఆత్మీయ సదస్సులో వక్తల పిలుపు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే - పట్నంబజార్‌: ముస్లింల అమాయకత్వమో.. రాజకీయ బలహీనతో తెలియదు కానీ తమకు కేటాయించిన పథకాలకు దశలవారీగా పాలకులు ఒక్కొక్కటిగా కోతపెడుతున్నారని ముస్లిం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర వర్గాల పథకాలను తొలగించాలన్నా, కుదించాలన్నా వారి నుంచి ప్రతిఘటన వస్తుందేమోనని వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. ముస్లింలంటే ప్రతి ఒక్కరికీ చులకన భావన ఉందని, ఇది పోవాలంటే రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆంధ్రా ముస్లిం కళాశాలలో ముస్లింల ఐక్యత పేరుతో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో పార్టీలకు అతీతంగా ఆ వర్గ నేతలు పాల్గొని వారికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. సమావేశంలో ముస్లిం ఐక్యవేదికను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా జియావూర్‌ రెహ్మాన్‌ను ఎన్నుకున్నారు. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుంటూరు తూర్పు వైకాపా ఎమ్మెల్యే షేక్‌ ముస్తఫా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీలుగా ఏర్పాటై ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలన్నారు. వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్నా ముస్లింలు తమ అభ్యున్నతికి కృషి చేయటానికి ఆలోచిస్తేనే అభివృద్ధి చెందుతారని చెప్పారు. తెదేపా జాతీయ అధికారి ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ముస్లిం సమాజాన్ని ఆదుకోవటానికి రాజకీయాలకతీతంగా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల ముస్లింలు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారన్నారు. అందువల్ల రాజ్యాంగం కల్పించిన హక్కులు వంటి వాటిపై మదర్సాల్లో అవగాహన కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, ఎస్‌డీఎఫ్‌ఐ, ఎండీఎఫ్‌ తదితర సంస్థల నాయకులు, పలువురు విశ్రాంత అధ్యాపకులు, వైద్యులు తదితరులు మాట్లాడారు. ‘ముస్లింల్లో పేదరికం, నిరక్షరాస్యత వంటి అంశాలపై సచార్‌ కమిషన్‌ ఎప్పుడో చెప్పింది. ఆ సిఫార్సులను పాలకులు అమలు చేయకపోయినా ప్రశ్నించే స్థితిలో ముస్లిం నేతలు లేరు. ఇతరుల వద్దకు వెళ్లి మోకరిల్లినంత కాలం మనల్ని ఏ రాజకీయ పార్టీ గుర్తించదు’ అని అన్నారు. కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి ముస్లిం ప్రతినిధులు, మహిళలు హాజరయ్యారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని