విద్యాశాఖలో పైరవీ బదిలీల అలజడి

పైరవీలతో ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సులతో 190 మంది ఉపాధ్యాయుల బదిలీకి

Updated : 27 Jun 2022 06:15 IST

నేతలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో 190 మంది బదిలీలకు జాబితా సిద్ధం

ఈనాడు, అమరావతి: పైరవీలతో ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం తెరతీసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సులతో 190 మంది ఉపాధ్యాయుల బదిలీకి జాబితా సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం ఉంది. ఈ సమయంలో విచక్షణాధికారంతో బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత పదోన్నతులిచ్చి, బదిలీలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈలోపే పైరవీల బదిలీలకు తెరతీసింది. రాష్ట్రవ్యాప్తంగా 190మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్న ప్రదేశం, బదిలీ కోరుకుంటున్న స్థానం, దీనికి సిఫార్సు చేసినవారి పేర్లతో ఓ జాబితాను పాఠశాల విద్యాశాఖకు పంపించింది. ఈ స్థానాలపై వివరాలు సమర్పించాలని కోరింది. మరో 200మందితో కూడిన జాబితానూ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఆ స్థానాలు వెళ్లిపోతే ఎలా? 

పైరవీ బదిలీల కారణంగా చాలాచోట్ల ప్రధానమైన స్థానాలు భర్తీ అయిపోతాయి. ఆ తర్వాత ఉపాధ్యాయులకు సాధారణ బదిలీల్లో కోరుకునేందుకు మంచి పోస్టులు ఉండవు. కర్నూలు జిల్లా చివరిలో మద్దికెరలో ఉన్న టీచర్‌ కర్నూలు నగరానికి సమీపంలోని కల్లూరుకు వచ్చేందుకు సిఫార్సు బదిలీకి దరఖాస్తు చేశారు. ఇది జరిగితే.. నగర సమీపంలోని పోస్టును సీనియర్‌ ఉపాధ్యాయులు కోల్పోతారు. 2020లో సాధారణ బదిలీలు చేసినప్పుడు 15వేల పోస్టులను బ్లాక్‌ చేశారు. ఇవన్నీ పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలో ఉన్నవే. దీంతో చాలామంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఉండేలా చూసేందుకు పోస్టులను బ్లాక్‌ చేసినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ ఖాళీలను పైరవీ వాళ్లతో నింపేస్తే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటి? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.


నిబంధనలకు విరుద్ధంగా బదిలీలా? 

‘నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడం సరైంది కాదు. దీంతో కౌన్సెలింగ్‌ విధానానికి విఘాతం కలుగుతుంది. సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోతారు. కౌన్సెలింగ్‌ లేకుండా జరిగే బదిలీలను నిలిపివేయాలి.’

- వెంకటేశ్వర్లు, మంజుల, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఫ్యాప్టో


సిఫార్సులతో బదిలీలు అన్యాయం

‘ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కంటే ముందుగానే సిఫార్సు బదిలీలకు ప్రభుత్వం సిద్ధమవ్వడం అన్యాయం. వెంటనే వీటిని నిలిపివేయాలి. బదిలీలు జరుగుతాయని టీచర్లు అందరూ ఎదురుచూస్తున్న సమయంలో సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వడం సీనియర్లకు నష్టం చేస్తుంది.’

- కరణం హరికృష్ణ, సామల సింహాచలం, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఫోర్టో


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని