చితికిపోతున్న చిన్న పరిశ్రమలు

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ముడిసరకు, మానవ వనరుల కొరత, ఆర్థిక సమస్యలు, ప్రతికూల మార్కెట్‌ పరిస్థితుల మధ్య

Published : 27 Jun 2022 02:52 IST

బ్యాంకర్లు, సర్కారు నుంచి దక్కని సహకారం

ఏటా 10 శాతం ఎంఎస్‌ఎంఈల మూత

ప్రభుత్వ ప్రతికూల విధానాలతోనూ కష్టాలు

రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించినా అందని వైనం

ఈనాడు, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ముడిసరకు, మానవ వనరుల కొరత, ఆర్థిక సమస్యలు, ప్రతికూల మార్కెట్‌ పరిస్థితుల మధ్య మనుగడ కోసం పోరాడుతున్నాయి. వివిధ సమస్యలతో ఏటా కనీసం 10 శాతం ఎంఎస్‌ఎంఈలు మూతపడుతున్నాయి. గతంలో వీటి జీవితకాలం పదేళ్లు కాగా ఇప్పుడది అయిదేళ్లకు పడిపోయింది. కొవిడ్‌ సమయంలోనే దాదాపు 25 శాతం మూతపడ్డాయని,  ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తేనే కష్టాల నుంచి గట్టెక్కుతాయని పారిశ్రామిక సంఘాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌ కష్టాల్లో ఉన్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్‌ ప్యాకేజీ అందినా కొంత ఉపశమనం దక్కేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 98 వేల ఎంఎస్‌ఎంఈలు వివిధ ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. సుమారు 12 లక్షల మందికి ఉపాధి కల్పించే ఈ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది.

ప్రభుత్వ విధానాలతో ప్రతికూలతే ఎక్కువ
ఎంఎస్‌ఎంఈలకు కూడా భారీ పరిశ్రమల మాదిరే లీజు విధానంలో భూములను కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించడం ఇబ్బందిగా మారింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సాధారణంగా అర ఎకరాకు మించి భూమి అవసరం ఉండదు. ఈ భూములకు పదేళ్లు లీజు చెల్లించిన తర్వాత పరిశ్రమ మనుగడలో ఉంటేనే.. వాటి విలువకు 20 శాతం ప్రీమియం కలిపి తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని ఏపీఐఐసీ తీసుకొచ్చింది. దీనివల్ల భూములపై హక్కులు లేక బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు. లీజు వ్యవధి ముగిసేటప్పటికి ఎక్కువ పరిశ్రమల జీవితకాలం ముగిసిపోతోంది. అప్పుడు భూములు తీసుకుని ప్రయోజనం ఏమిటని వాటి యజమానులు ప్రశ్నిస్తున్నారు.

* గ్రామీణ ప్రాంతాల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహం లేదు. వారి పేరిట గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూములను కొలేటరల్‌ సెక్యూరిటీగా పెట్టుకుని రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు అంగీకరించడం లేదు. పెట్టుబడుల కోసం వ్యవసాయ భూములు అమ్ముకోవడం లేదంటే అధిక వడ్డీకి బయట అప్పులు తెచ్చుకోవడం తప్పనిసరవుతోంది. వ్యవసాయ భూములను హామీగా పెట్టుకుని రుణాలు ఇచ్చేలా నిబంధన తేవాలి.

* పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఎంఎస్‌ఎంఈల్లో 25-30 శాతం కొరత ఉంది. దీని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది.

నేడు అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవం
అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. పరిశ్రమల నిర్వాహకులు పాల్గొని.. క్షేత్రస్థాయి ఇబ్బందులను తెలియజేయవచ్చని అధికారులు చెప్పారు.


ప్రభుత్వ సహకారం అందితేనే..

* కొవిడ్‌ సమయంలో చిన్న పరిశ్రమలను ఆదుకోవటానికి ప్రభుత్వం ప్రకటించిన రీస్టార్ట్‌ ప్యాకేజీ ఫలాలు ఇప్పటికీ అందలేదు. నిర్వహణ మూలధనం కింద రూ.200 కోట్లను తక్కువ వడ్డీ రేటుకు ఇస్తామన్న హామీ అమలు కాలేదు.

* 2020 ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి పరిశ్రమలు చెల్లించాల్సిన గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలను మాఫీ చేసి, సుమారు రూ.188 కోట్లు లబ్ధి చేకూరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ సాయమూ అందలేదు.

* ‘ప్రిఫరెన్షియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ పాలసీ’ ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసే వాటిలో 25 శాతం కచ్చితంగా ఎంఎస్‌ఎంఈల నుంచి తీసుకోవాలని, వాటికి 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలన్న నిబంధన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎంఎస్‌ఎంఈల నుంచి 360 రకాల ఉత్పత్తులు తీసుకుంటామని చెప్పినా అతీగతీ లేదు.

* ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్ష వరకు ఉన్న బకాయిల వివాదాన్ని పరిష్కరించడానికి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించే అవకాశం ఉండేది. ఈ మొత్తాన్ని కేంద్రం రూ.కోటికి పెంచడంతో అత్యధిక ఎంఎస్‌ఎంఈలు ఎన్‌సీఎల్‌టీ ద్వారా వివాదాలు పరిష్కరించుకునే వెసులుబాటును కోల్పోయాయి. కార్పొరేట్‌ సంస్థలకు ఉత్పత్తులు సరఫరా చేసి, అవి ఇచ్చినప్పుడే బిల్లులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని