పీటీడీ ఉద్యోగులకు పాత జీతమే!

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ఈనెల 3న ఉత్తర్వులిచ్చినప్పటికీ.. జూన్‌ నెలకు సంబంధించి గతనెల మాదిరిగా ఆర్టీసీలో ఉన్నట్లుగా పాత జీతాలే

Published : 27 Jun 2022 04:04 IST

పీఆర్సీ అమల్లోకి వచ్చినా ఈ నెలా నిరాశే

ఈనాడు-అమరావతి: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ ఈనెల 3న ఉత్తర్వులిచ్చినప్పటికీ.. జూన్‌ నెలకు సంబంధించి గతనెల మాదిరిగా ఆర్టీసీలో ఉన్నట్లుగా పాత జీతాలే ఇవ్వనున్నారు. జూన్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా సాంకేతిక సమస్యల కారణంగా ఇది సాధ్యంకాలేదని అధికారులు చెబుతున్నారు. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల బేసిక్‌, డీఏ, ఇతర అలవెన్సులు తదితరాలన్నీ లెక్కించి.. కొత్త జీతాల జాబితాను ఆర్టీసీ అధికారులు సిద్ధంచేసి, ఇటీవల ఆర్థికశాఖకు పంపారు. అయితే సీఎఫ్‌ఎంఎస్‌లో ఇవి అప్‌లోడ్‌ కాలేదని చెబుతున్నారు. అలాగే పీఆర్సీలో పేర్కొన్న విధంగానే బేసిక్‌, ఇతర భత్యాలు  ఖరారు చేశారా? అందులో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా? అనేది పరిశీలిస్తామని ఆర్థికశాఖ అధికారులు తాజాగా చెప్పినట్లు సమాచారం. ఇది కూడా కొత్త జీతాలు ఇవ్వకలేకపోవడానికి కారణమేనని తెలిసింది. ఆర్టీసీ అధికారులు ఇచ్చిన సమాచారం అంతా పక్కాగా ఉందా? లేదా? అనేది ఆడిట్‌ జరపాల్సి ఉంటుందని, అందువల్లే ఈ నెల పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో కొత్త పీఆర్సీ ప్రకారం ఈనెల జీతం వస్తుందని ఎదురుచూసిన 51 వేల మంది పీటీడీ ఉద్యోగులకు నిరాశ ఎదురుకానుంది. ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఈ ఏడాది జనవరి నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇస్తున్నారు. పీటీడీ ఉద్యోగులకు మాత్రం వారి కంటే ఆరు నెలలు ఆలస్యంగా పీఆర్సీ జీవోలు ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు తీసుకుందామని భావించిన పీటీడీ ఉద్యోగులకు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని