Published : 27 Jun 2022 04:04 IST

భాజపా చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం

రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతోందని ప్రముఖ జర్నలిస్టు, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ విమర్శించారు. నెల్లూరులో ఆదివారం జరిగిన జెట్టి శేషారెడ్డి 12వ స్మారక రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘మతం- రాజకీయం’ అనే అంశంపై ప్రసంగించారు. అగ్నిపథ్‌తో ఆర్మీలో రిటైర్‌మెంట్‌ ఉండదని, దేశభద్రతకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, సోషలిస్టు, అన్ని మతాలు, కులాల రైతులు, కార్మికులు, ఆదివాసీలు ఇలా అన్ని వర్గాలు పాల్గొన్నాయని, ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదని, పైగా వ్యతిరేకించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి పుట్టిన భాజపా.. ప్రస్తుతం జాతీయజెండాను, జాతీయ గీతాన్ని ఆలపించలేదని ప్రజాస్వామ్యవాదులను అరెస్టు చేస్తోందని విమర్శించారు. తమను ఏ శక్తీ ఆపలేదని, చరిత్రను తిరగరాస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను కేంద్రం పెద్దఎత్తున చేస్తోందని, ఆ యోధుడికి మతం రంగు పులిమే చర్యలు జరుగుతున్నాయన్నారు. గతంలో ఇలాగే ఛత్రపతి శివాజీ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. భారతదేశాన్ని హిందూదేశంగా చేస్తామని బహిరంగ ప్రకటనలిస్తున్నారని, ముస్లిం, మైనార్టీలపై దాడులు పెరిగాయని, ఇది వినాశనం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గోద్రా అల్లర్లలో బాధితుల పక్షాన కోర్టులో పోరాడిన సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను జాతీయ భద్రత చట్టం కింద అరెస్టు చేశారని, గతంలో మూఢ విశ్వాసాల నిర్మూలన చట్టం కోసం పోరాడిన నరేంద్ర దభోల్కర్‌ను, కర్ణాటకలో అభ్యుదయ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ను హత్యచేశారని గుర్తుచేశారు. ప్రజల కోసం పోరాడుతున్న, నిజాలు మాట్లాడుతున్న వారిని ఈ ప్రభుత్వం జైలులో పెడుతోందన్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ తమ తీరు మార్చుకోకుంటే దేశం పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని