రాజధాని భవనాలు అద్దెకా?

హైకోర్టులో రాజధాని కేసుల నుంచి తప్పించుకొనేందుకే ప్రభుత్వం భూముల అమ్మకం నాటకం ఆడుతోందని అమరావతి ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వెలగపూడిలోని అమరావతి ఐకాస కార్యాలయంలో

Published : 28 Jun 2022 05:54 IST

భూములమ్మి పనులు ప్రారంభిస్తామనడం విడ్డూరం

అమరావతి ఐకాస సమన్వయ కమిటీ ఆగ్రహం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - తుళ్లూరు గ్రామీణం: హైకోర్టులో రాజధాని కేసుల నుంచి తప్పించుకొనేందుకే ప్రభుత్వం భూముల అమ్మకం నాటకం ఆడుతోందని అమరావతి ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వెలగపూడిలోని అమరావతి ఐకాస కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అమరావతి అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని ఆరోపించారు. రాజధాని భూముల అమ్మకం, భవనాలను అద్దెకు ఇవ్వడాన్ని ప్రభుత్వ కుట్రగానే ప్రజలు భావిస్తున్నారన్నారు. అమరావతిలోని రైతులు, రైతు కూలీల సమస్యలపై సీఆర్‌డీఏ కమిషనర్‌ను కలిసినా భూముల అమ్మకం విషయం తమకు చెప్పకుండా రహస్యంగా జీవోలు జారీ చేయటమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. రాజధాని అభివృద్ధి పనుల నిర్ణయాలపై ముందుగా రైతులతో చర్చించాలని డిమాండ్‌ చేశారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ పనులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాజధాని భూములు అమ్మి పనులు మొదలుపెడతామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికీ వైకాపా నాయకులు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటున్నారని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల ద్వారా రుణాలు తెచ్చి వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అమరావతిలో కొంత అభివృద్ధి జరిగితేనే భూముల విలువ పెరుగుతుందన్నారు. అప్పుడు దశలవారీగా మిగులు భూములమ్మి రాజధాని నిర్మాణానికి ఉపయోగించవచ్చని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించడం దారుణమన్నారు. బృహత్‌ప్రణాళిక ప్రకారం అమరావతిని అభివృద్ధి చేస్తే రాజధాని భూముల విలువ భారీగా పెరుగుతుందన్నారు. సంపదను సృష్టించటం చేతగాని ముఖ్యమంత్రికి రాజధాని భూములు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు పువ్వాడ సుధాకర్‌, గార్నేని స్వరాజ్యరావు, జూజాల చలపతిరావు, రాజశేఖర్‌ రెడ్డి, ఆకుల ఉమామహేశ్వరరావు, దళిత ఐకాస నాయకులు గడ్డం మార్టిన్‌, చిలకా బసవయ్య, సువర్ణకమల తదితరులు పాల్గొన్నారు.

* మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు సోమవారం 923వ రోజుకు చేరాయి. ‘న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుతున్న న్యాయస్థానాలు వర్ధిల్లాలి.. అమరావతిని నిర్మించండి.. ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి, బిల్డ్‌ అమరావతి.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరు, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, కృష్ణాయపాలెం, నెక్కల్లు, ఉద్దండరాయునిపాలెం, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని