ఈ-పంటను బలోపేతం చేయండి

ఈ-పంట ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నమోదుకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే, వ్యవసాయ సహాయకులకు సంయుక్త అజమాయిషీ అప్పగించాలని.

Updated : 28 Jun 2022 05:53 IST

వీఆర్‌వో, సర్వే, వ్యవసాయ సహాయకులదే సంయుక్త అజమాయిషీ

రైతుకు రసీదు ఇవ్వాలి 

వ్యవసాయశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ఈ-పంట ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నమోదుకు సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే, వ్యవసాయ సహాయకులకు సంయుక్త అజమాయిషీ అప్పగించాలని.. గ్రామంలో సాగు చేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్‌ పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సమీక్షలో భాగంగా ఈ-క్రాప్‌, ధాన్యం కొనుగోలుపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ‘రైతు పండించిన ప్రతి పంటను ‘ఈ-పంట’లో నమోదు చేయాలి. వారికి రసీదు పత్రాలను ఇవ్వాలి. డిజిటల్‌ రసీదును వారి సెల్‌ఫోన్‌కు పంపాలి. పంట నష్టం జరిగితే వాటి ఆధారంగా రైతుకు ప్రశ్నించే హక్కు వస్తుంది. జియో ట్యాగింగ్‌, ఫొటోలను ఈ-పంటలో పెట్టాలి. నమోదు ప్రక్రియను జూన్‌ 15 నుంచి ఆగస్టు చివరిలోగా పూర్తి చేయాలి. సెప్టెంబరు మొదటి వారంలో సామాజిక తనిఖీ చేపట్టాలి. జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. ఈ-పంటపై ఉన్నతాధికారులు ప్రతి 15 రోజులకోసారి పర్యవేక్షణ చేయాలి. మండల, జిల్లాస్థాయి అధికారులు తనిఖీ చేయాలి’ అని నిర్దేశించారు.

ధాన్యాన్ని వేబ్రిడ్జిలో తూకం వేయించి రసీదు ఇవ్వాలి

రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేసే ధాన్యాన్ని వేబ్రిడ్జిల్లో తూకం వేయించి రైతులకు రసీదు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ‘ధాన్యం విక్రయాలకు రైతులు మిల్లర్ల దగ్గరకు పోయే పరిస్థితి ఉండకూడదు. ఆర్‌బీకేల ద్వారానే కొనుగోలు జరగాలి. కొనుగోలు, సొమ్ము చెల్లింపులో పూర్తి బాధ్యత పౌర సరఫరాల శాఖదే. మద్దతు ధరలో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూడాలి’ అని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.


నేడు ప్యారిస్‌కు ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ప్యారిస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 3న ఆయన తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి కుమార్తె హర్షా రెడ్డి ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేసిన నేపథ్యంలో.. ఆమె కాన్వకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌ దంపతులు ప్యారిస్‌ వెళుతున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని