ఆంక్షల వలయంలో శ్రీకాకుళం

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో విధించిన ఆంక్షలు ప్రజలను కష్టాల పాల్జేశాయి. హెలిప్యాడ్‌ ఉన్న ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి అమ్మఒడి కార్యక్రమ సభావేదిక అయిన కోడి రామ్మూర్తి స్టేడియం వరకూ

Published : 28 Jun 2022 04:40 IST

దారుల్లో బారికేడ్ల ఏర్పాటు, దుకాణాల మూసివేత

ఉక్కపోతతో సభను వీడిన మహిళలు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో విధించిన ఆంక్షలు ప్రజలను కష్టాల పాల్జేశాయి. హెలిప్యాడ్‌ ఉన్న ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి అమ్మఒడి కార్యక్రమ సభావేదిక అయిన కోడి రామ్మూర్తి స్టేడియం వరకూ రహదారికి ఇరువైపులా భారీస్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా పరదాలతో కప్పేశారు. వీధుల నుంచి వాహనాలను బయటకు రానీయలేదు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకూ దుకాణాలు తెరవనీయలేదు. నగరంలోకి బస్సులు, ఇతర వాహనాలను అనుమతించకపోవడంతో ప్రయాణికులు శివార్లలో గంటల తరబడి నిరీక్షించారు. ట్రాఫిక్‌ ఆంక్షలు కఠినం చేయడంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపాధ్యాయ సంఘాల నేతలను, వామపక్షాల నాయకులను గృహనిర్బంధం చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను, వారి తల్లులను పెద్దసంఖ్యలో తరలించిన అధికారులు.. అందుకు తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు. సగానికి పైగా మండుటెండలో ఉండిపోయారు. వేడిమికి తట్టుకోలేక ఆరుగురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారు. కొందరికి అక్కడే చికిత్స అందించగా, ఒక విద్యార్థినిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. సభ ప్రారంభానికి ముందే కొందరు పిల్లలు, తల్లులు బయటకు వచ్చేశారు.

కిల్లి కృపారాణికి చేదు అనుభవం: ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కేంద్ర మాజీ మంత్రి, వైకాపా జిల్లా మాజీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఆర్‌అండ్‌బీ భవనం ప్రాంగణంలోని హెలిప్యాడ్‌ వద్దకు రాగా, ప్రొటోకాల్‌ జాబితాలో ఆమె పేరు లేదంటూ భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆమె ఆగ్రహంతో ‘కిల్లి కృపారాణినే మర్చిపోతారా?’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమెను బుజ్జగించేందుకు మంత్రి సీదిరి అప్పలరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కృష్ణదాస్‌ ఆమె కారు వద్దకెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. ‘అన్నయ్యా.. ఇక్కడ జరిగిందంతా బావ(తన భర్తనుద్దేశించి)కు తెలిసిపోయింది. ఆయన నన్ను చంపేస్తారు. నేను ఎమోషన్‌కు గురవుతున్నాను. దయచేసి మన్నించు’ అంటూ వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని