నేడు పోలవరానికి ఎన్‌హెచ్‌పీసీ బృందం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌) బృందం వస్తోంది. మంగళ, బుధ వారాల్లో పోలవరంలోనే ఉండి దానిని పరిశీలిస్తుంది.

Updated : 28 Jun 2022 05:56 IST

రెండు రోజులపాటు అక్కడే

డయాఫ్రం వాల్‌ సామర్థ్యం అంచనా

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌) బృందం వస్తోంది. మంగళ, బుధ వారాల్లో పోలవరంలోనే ఉండి దానిని పరిశీలిస్తుంది. గోదావరి వరదల వల్ల ధ్వంసమైన డయాఫ్రం వాల్‌ పరిస్థితి ఏమిటనేది తేల్చాల్సి ఉంది. దాని సామర్థ్యాన్ని, స్థితిగతులను అధ్యయనం చేసే బాధ్యతను ఎన్‌హెచ్‌పీసీకి అప్పగించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ, కేంద్ర జలసంఘం పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో తీస్తా విద్యుత్తు ప్రాజెక్టులో ఇలాంటి సమస్య వచ్చిందని, దానిని పరిష్కరించిన అనుభవం ఎన్‌హెచ్‌పీసీకి ఉండటంతో ఇప్పుడు కూడా ఈ అంశం అధ్యయన బాధ్యతలు వారికి అప్పగించాలని నిర్ణయించారు.

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రాతి, మట్టి కట్ట నిర్మాణంలో భాగంగా నీటి ఊట నియంత్రణ కోసం గోదావరి నదీ గర్భంలో దాదాపు 1300 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్‌ నిర్మించారు. గోదావరి లోపల కొన్ని చోట్ల 90 అడుగుల లోతు నుంచి ఈ కట్టడం నిర్మించుకుంటూ వచ్చారు. విదేశీ కంపెనీ బావర్‌, దేశీయ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ సంయుక్తంగా ఈ నిర్మాణం చేపట్టాయి. దీని సామర్థ్యాన్ని తేల్చాలని తొలుత బావర్‌ కంపెనీని ప్రభుత్వం కోరినా ఆ నైపుణ్యం తమకు లేదని తేల్చి చేప్పింది. దీంతో ఏపీ జలవనరులశాఖ ఎన్‌హెచ్‌పీసీకి లేఖ రాసి డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చాలని, ఈ విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలని కోరింది.

ఎన్‌హెచ్‌పీసీ జియో టెక్నాలజీ విభాగంలో నైపుణ్యం ఉన్న ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎల్‌.కపిల్‌, మరో ఇద్దరు నిపుణులు విపుల్‌ నాగర్‌, ఎ.కె.భర్తీలు వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారు అధికారులకు తెలియజేశారు. తొలుత వారు పోలవరంలో పర్యటించి.. డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తెలుసుకోవాలంటే ఎలాంటి భూ భౌతిక(జియోఫిజికల్‌) అధ్యయనాలు చేయాలో ఒక అంచనాకు రానున్నారు. ఈ అధ్యయనాలకు ఇక్కడ ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. పోలవరంలో డయాఫ్రం వాల్‌ దాదాపు నీటిలోనే ఉంది. చాలా భాగం గోదావరి గర్భంలో ఉంది. నేరుగా చూసి పరిశీలించేందుకు అనుకూలంగా లేదు. ఈ క్రమంలో వారి పరిశీలన తర్వాత సంబంధిత అధ్యయన మార్గాలు, అందుకు ఏమేం కావాలి అనే అంశాలపై అక్కడి అధికారులు, పోలవరం అథారిటీ ముఖ్యులతో చర్చించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలా? అన్న అంశంపైనా ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఎన్‌హెచ్‌పీసీ అధ్యయనం ముగిసిన తర్వాతే అక్టోబరు, నవంబరు నాటికి ఒక నిర్ణయం తీసుకోగలమనే ఆలోచనతో కేంద్ర నిపుణులు, ముఖ్యులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని