సంక్షిప్త వార్తలు

ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు (ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌- ఈసీ)గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి ఈసీగా నామినేట్‌ కావడం సంప్రదాయంగా

Updated : 28 Jun 2022 05:51 IST

న్యాయసేవాధికార సంస్థ ఈసీగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు (ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌- ఈసీ)గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి ఈసీగా నామినేట్‌ కావడం సంప్రదాయంగా వస్తోంది. హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రను సంప్రదించిన తర్వాత గవర్నర్‌.. జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేరును న్యాయసేవాధికార సంస్థ ఈసీగా నామినేట్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఈసీగా బాధ్యతలు నిర్వహించిన జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా పట్నా హైకోర్టుకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.


శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం   

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనం కోసం సోమవారం సాయంత్రానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి ఏటీసీ ప్రాంతం వరకు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనానికి 12 గంటలు పడుతోంది. శ్రీవారిని ఆదివారం 88,613 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.24 కోట్ల హుండీ కానుకలు లభించాయి.


వెబ్‌సైట్‌లో ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు

ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లను సోమవారం నుంచి వెబ్‌సైట్‌లో ఉంచారు. జులై 4న భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పరీక్ష కేంద్రాన్ని మార్పు చేశారు. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని విష్ణు ఇంజినీరింగ్‌ కళాశాలకు మర్చారు. ఎస్‌ఆర్‌కేఆర్‌లో మొదటి రోజు పరీక్ష రాయాల్సిన 220మంది విద్యార్థులకు విష్ణు కళాశాలలో రెండు రోజులు నిర్వహిస్తారు. జులై 5నుంచి ఎస్‌ఆర్‌కేఆర్‌లోనే పరీక్ష కేంద్రం యధావిధిగా ఉంటుంది. ఈఏపీ సెట్‌కు ఇప్పటి వరకు 2,98,634మంది దరఖాస్తు చేసుకున్నారు.


ఏపీ క్యాడర్‌కు పెద్దింటి ధాత్రిరెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఒడిశా క్యాడర్‌కు చెందిన 2020 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ధాత్రిరెడ్డిని ఏపీ క్యాడర్‌కు మారుస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆమె 2019 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ను వివాహం చేసుకోవడంతో క్యాడర్‌ మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని