AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసింది. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు

Updated : 29 Jun 2022 07:35 IST

పోస్టింగు ఇచ్చి 15 రోజులే... అంతలోనే చర్య

ఈనాడు, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సస్పెండ్‌ చేసింది. నిఘా విభాగం చీఫ్‌గా పని చేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగంపై తాజాగా సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర అవినీతి అభియోగాలున్నాయని, ఇప్పటికే ఆయన్ని సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయడానికి సిఫార్సు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులపై ఉండే క్రిమినల్‌ అభియోగాలన్నీ తొలగిపోయేంతవరకు లేదా కొట్టేసేంతవరకు వారిపై సస్పెన్షన్‌ విధించే విచక్షాణాధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పొందుపరిచారు. ఈ మేరకు అఖిల భారత సర్వీసు నియమావళి ప్రకారం... ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా పోస్టింగు ఇచ్చామని, ఆ తర్వాత ఆయన తాను ఎదుర్కొంటున్న నేర విచారణకు సంబంధించిన వ్యవహారంలో సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించామన్నారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, సస్పెన్షన్‌ అమల్లో ఉన్న కాలంలో ఆయన, విజయవాడను విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.

వైకాపా అధికారం చేపట్టిన వెంటనే 2019 మే 30న ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగు  ఇవ్వలేదు. ఆ తర్వాత భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపి.. 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్‌ చేసింది. తన సస్పెన్షన్‌ అక్రమం అంటూ ఆయన హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 18న ఆయనను విధుల్లోకి తీసుకుంది. సుప్రీం ఆదేశాల మేరకు తనకు పోస్టింగు ఇవ్వాలని పలుమార్లు సీఎస్‌కు వినతిపత్రాలుఇచ్చాక జూన్‌ 14న ఆయన్ని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. బాధ్యతలు చేపట్టి 15 రోజులైనా గడవకముందే మరోమారు ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని