Updated : 29 Jun 2022 06:14 IST

ఇదో అప్పుల మాయ!

పీడీ ఖాతాల్లో నిల్వలు సున్నా చేసేందుకే ఇలా..

కొద్దిరోజుల్లోనే తిరిగిరానున్న జీపీఎఫ్‌ మొత్తాలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో సొమ్ములు ఎందుకు మాయమయ్యాయి.? ఇదంతా అప్పుల మాయలో భాగమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలోనూ ఇలాగే జీపీఎఫ్‌ సొమ్ములు ఉద్యోగుల ఖాతాల నుంచి మాయమయ్యాయి. అప్పట్లో కొందరు ఇలా ఆందోళన వ్యక్తం చేశాక.. కొద్దిరోజుల్లోనే వారి ఖాతాల్లో ఆ సొమ్ములు పడ్డాయి. దీనిపై లోతుగా విశ్లేషిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతున్న మాట తెలిసిందే. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉన్న లెక్కలన్నీ మార్చిలో మారిపోవడం వివాదమవుతోంది. కాగ్‌ కూడా కొన్ని రెవెన్యూ ఖాతాల్లో హఠాత్తుగా సొమ్ములు వచ్చి పడ్డాయని, అంతవరకు ఖర్చు చేసినట్లుగా చూపించి హఠాత్తుగా మార్చిలో ఖర్చు చేయలేదంటూ ఆ నిధులు చూపించారని తప్పుపట్టింది. దాదాపు ఇది అలాంటి విన్యాసాల్లో భాగంగానే చెప్పవచ్చు.ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఏటా ప్రభుత్వం తన అప్పును తక్కువ చేసి చూపించేందుకు, రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును తక్కువ చేసి చూపించేందుకు తాపత్రయపడుతోంది. ఇదంతా అందులో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వం తన అప్పులను తక్కువ చేసి చూపించేందుకు పీడీ ఖాతాల విషయంలో చేస్తున్న మాయాజాలంలో భాగంగా ఇదంతా సాగుతోందని పేర్కొంటున్నారు. 

ప్రతి ఉద్యోగికీ జీపీఎఫ్‌ ఖాతా ఉంటుంది. ఆ ఖాతాలన్నీ మూడు పీడీ ఖాతాలతో అనుసంధానమై ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి వసూలుచేసే జీపీఎఫ్‌, ఏపీ జీఎల్‌ఐ ఇవన్నీ పబ్లిక్‌ అకౌంట్‌లో భాగమే. పబ్లిక్‌ అకౌంట్‌లో ఉన్న సొమ్ములను ప్రభుత్వం వినియోగించుకుని, వాటిపై ఉద్యోగులకు వడ్డీ చెల్లిస్తోంది. ప్రతి ఏటా ఉద్యోగుల నుంచి వసూలు చేసే ఈ మొత్తాలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు తిరిగి చెల్లించిన మొత్తాల మధ్య ఉన్న వ్యత్యాసం ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన ఒక అప్పుగా పరిగణనలోకి వస్తుంది. ఆ మొత్తాన్ని కాగ్‌ రాష్ట్ర అప్పులకు జత చేస్తుంది.

ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పీడీ ఖాతాల్లో ఎంత మొత్తం నిల్వ ఉంటే అదంతా ప్రభుత్వ రుణంగానే లెక్కలోకి వస్తుంది. అందుకే ఏటా ఆర్థికశాఖ అధికారులు మార్చి నెలాఖరున పీడీ ఖాతాల నిల్వలను సున్నా చేసి చూపిస్తున్నారనే చర్చ ఉంది. ఖాతాల్లో నిల్వలు మాయమవడం,  మళ్లీ కొన్నాళ్లకు ఆ మొత్తాలు అదే పీడీ ఖాతాల్లోకి వచ్చి చేరడం సాగుతోంది. ప్రస్తుత ఏడాది జీపీఎఫ్‌ మొత్తాన్ని తక్కువ చేసి చూపించి మొత్తం అప్పును తగ్గించి చూపే క్రమంలోనే ఆయా పీడీ ఖాతాల్లో ఉన్న నిల్వలన్నీ సున్నా చేసి చూపడంతో ఆ మేరకు ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో ఆ తాజా చేరికలు డెబిట్‌ అయినట్లు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్పటికే కాగ్‌ వద్ద ఖరారైన మొత్తాలను మార్చలేనందున ఆ నిల్వలు అలాగే ఉంచి తాజాగా జమ చేసిన మొత్తాలు మాత్రమే ఇలా పీడీ ఖాతాల నుంచి బదలాయించినట్లు విశ్లేషిస్తున్నారు. అందువల్ల వారి ఖాతాల్లో కొంత మొత్తాలు మాయమయ్యాయి. మళ్లీ కొద్దిరోజుల్లోనే అవి వచ్చి చేరతాయని పేర్కొంటున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని