ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!

తెల్లవారితే బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. అన్ని ఏర్పాట్లూ జరిగాయి.. సిఫార్సులతో సంబంధం లేకుండా, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు రవాణాశాఖ కమిషనర్‌ కాటంనేని

Updated : 29 Jun 2022 09:24 IST

సిఫార్సులు ఒప్పుకోలేదని రవాణా శాఖ కమిషనర్‌పై కినుక

ఆయనను మార్చాలని సీఎంఓపై ఓ అమాత్యుడి ఒత్తిడి

తనిఖీల నుంచి పత్రాల వరకు ప్రక్షాళన ఫలితం!

ఈనాడు, అమరావతి: తెల్లవారితే బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. అన్ని ఏర్పాట్లూ జరిగాయి.. సిఫార్సులతో సంబంధం లేకుండా, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టేందుకు రవాణాశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ సన్నాహాలు చేశారు. ఇంతలోనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఇది ఆ శాఖలో సంచలనంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా నిబంధనలు కచ్చితంగా పాటిస్తానని చెప్పిన ఆయన్ను చివరి నిమిషంలో పదవి నుంచి తప్పించడం ఇపుడు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. బుధ, గురువారాల్లో రవాణాశాఖ అధికారులు, ఉద్యోగులకు బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్‌ పూర్తిచేసి.. ఆ వెంటనే ఆర్డర్స్‌ ఇచ్చేలా కమిషనర్‌ ఏర్పాట్లు చేశారు. ఇంతలో మంగళవారం రాత్రి ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆదేశాలొచ్చాయి. ఓ అమాత్యుడు పట్టుబట్టి, సీఎంవోతో పదేపదే సంప్రదించి.. బదిలీ చేయించారనే ప్రచారం జరుగుతోంది. రవాణాశాఖలో కొందరు అధికారులు సైతం భాస్కర్‌ను ఎలాగైనా పంపేయడానికి తమవంతుగా ఉన్నతస్థాయిలో ప్రయత్నించారని చెబుతున్నారు.

నాటి నుంచే ఒత్తిళ్లు
ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినప్పటి నుంచి రవాణాశాఖలో ఒత్తిళ్లు మొదలయ్యాయి. కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రజాప్రతినిధుల ద్వారా సిఫార్సులు చేయించుకున్నారు. అలాగే కొందరు నేతలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోకి నచ్చినవారిని ఆర్టీవోలు, ఎంవీఐలు, ఏఎంవీలుగా తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కమిషనర్‌ భాస్కర్‌మాత్రం నిబంధనలను ఉల్లంఘించేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. రెండేళ్ల కాలపరిమితి దాటిన వారిని, ఇప్పటి వరకు ఫోకల్‌లో ఉన్నవారిని నాన్‌ ఫోకల్‌కు, అలాగే నాన్‌ ఫోకల్‌లో ఉన్నవారిని ఫోకల్‌ పోస్టుల్లోకి బదిలీలు చేసేలా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అందరి నుంచి అభ్యర్థనలు తీసుకున్నారు.

ముందే ఊహించారా?
నేతల సిఫార్సుల గురించి కమిషనర్‌పై అనేక విధాలుగా ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోలేదని తెలిసింది. ఎవరి మాటా వినకపోవడంతో.. ఏకంగా ఆయన్నే బదిలీ చేస్తారంటూ వారంరోజులుగా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆయన వెళ్లిపోతే చాలు.. సిఫార్సులను బట్టి బదిలీలు చేయించుకోవచ్చనే భావన నెలకొంది. ఒత్తిళ్లు పెరుగుతుండటంతో కమిషనర్‌ ఈనెల 30 వరకు ఆగకుండా, 24, 25 తేదీల్లోనే బదిలీలకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో తప్పనిసరై కౌన్సిలింగ్‌ను 29, 30 తేదీలకు వాయిదా వేశారు. చివరకు ఇప్పుడు ఆయనే బదిలీ అయ్యారు.

మూడు నెలల్లో మార్పు..
కాటంనేని భాస్కర్‌ ఏప్రిల్‌ 6న రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. చాలాకాలంగా ఈ శాఖలో ఐపీఎస్‌లే కమిషనర్లుగా ఉండగా, ఐఏఎస్‌ అయిన భాస్కర్‌కు ఈ బాధ్యతలు ఇచ్చారు. వెంటనే ఆయన ప్రక్షాళన ఆరంభించారు. రోడ్లపై వాహనాలు ఆపి తనిఖీలు చేయొద్దని సిబ్బందికి చెప్పారు. ఏళ్ల తరబడి ఒకే సంస్థ స్మార్ట్‌ కార్డులు సరఫరా చేస్తుండటం, ఆ సంస్థకు ప్రభుత్వం బకాయిలు ఇవ్వక కార్డుల సరఫరా ఆగిపోవడం.. తదితరాలను గుర్తించి స్మార్ట్‌కార్డ్‌ల జారీని ఆపేయాలని నిర్ణయించారు. వాహనదారులు తనిఖీల్లో అవసరమైన పత్రాలన్నీ చూపేందుకు యాప్‌ రూపొందించారు. వాహన బీమా, కాలుష్య తనిఖీ, రెన్యువల్‌ గడువు ముగుస్తున్నా, సరకు రవాణాదారుల పన్ను చెల్లింపు కాలం సమీపిస్తున్నా.. వాళ్లందరి ఫోన్లకు సందేశాలు పంపి అప్రమత్తం చేసేవిధానం తీసుకొచ్చారు. 3 నెలల్లో అందరూ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లు ఏర్పాటుచేసుకునేలా ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 3 నెలల్లోనే బదిలీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని