ప్రభుత్వమే సినిమా టికెట్లను విక్రయించడం సరికాదు

ప్రభుత్వ ఆన్‌లైన్‌ వేదిక ద్వారానే సినిమా టికెట్లను విక్రయించాలనడం సరికాదని ‘బుక్‌ మై షో’ తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ

Updated : 29 Jun 2022 06:09 IST

ప్రైవేటు సంస్థల వ్యాపారానికి ఇది దెబ్బ

హైకోర్టులో ‘బుక్‌ మై షో’ వాదనలు

విచారణ నేటికి వాయిదా

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఆన్‌లైన్‌ వేదిక ద్వారానే సినిమా టికెట్లను విక్రయించాలనడం సరికాదని ‘బుక్‌ మై షో’ తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ నిర్ణయం ప్రైవేటు సంస్థల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రభుత్వం నేరుగా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే అభ్యంతరం లేదని, తమను కూడా ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రూపొందించే వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు విక్రయించాలనడం సరికాదని పేర్కొన్నారు. ప్రతి టికెట్‌పై రూ.2 సర్వీసు ట్యాక్‌ వసూలుకు నిర్ణయించడం, మరోవైపు తమ వేదికనే అనుసంధానం చేసుకోవాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సరైన వ్యవస్థ లేకుండానే ప్రభుత్వం ఆన్‌లైన్‌ విక్రయాలకు తెర తీసిందని అన్నారు. విక్రయ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించనుందని, ఈ నిర్ణయం గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని వాదించారు. సమస్యలను పరిగణనలోకి తీసుకొని జులై 2నుంచి అమల్లోకి వచ్చే ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయ ప్రక్రియను నిలువరించాలని కోరారు. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన సవరణ చట్టం, తదనంతర ఉత్తర్వులను సవాలుచేస్తూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. బిగ్‌ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (బుక్‌ మై షో) ప్రైవేట్‌ లిమిటెడ్‌, దాని డీజీఎం సందీప్‌ అన్నోజ్‌వాలా హైకోర్టును ఆశ్రయించారు.

ధరల నియంత్రణకే నిర్ణయం: ఏజీ 

ప్రభుత్వ నిర్ణయంతో టికెట్‌ విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని, అధిక ధరలకు కళ్లెం పడుతుందని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వివరించారు. ‘బుక్‌ మై షో’ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ వెబ్‌సైట్‌తో అనుసంధానమై టికెట్లు విక్రయించుకోవచ్చని అన్నారు. ‘బుక్‌ మై షో’ ప్రతి టికెట్‌పై 14నుంచి 17శాతం కన్వేయన్స్‌ ఛార్జి వసూలుచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ కొత్త విధానాన్ని కొంతకాలం పరిశీలించాలని, ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులివ్వవద్దని కోరారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీలుగా  తెచ్చిన సవరణ చట్టాన్ని సవాలుచేస్తూ ‘మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ తరఫున మంజీత్‌సింగ్‌ తదితరులు వేసిన వ్యాజ్యంపైనా హైకోర్టు విచారించింది. సమయం సరిపోకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.


డిప్యూటీ తహసీల్దార్ల ప్యానల్‌ కూర్పులో అక్రమాలపై వ్యాజ్యం

ప్రత్యక్ష నియామకాల ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు తహసీల్దార్‌గా పదోన్నతి కల్పించడంలో అన్యా యం జరుగుతోందని పలువురు డిప్యూటీ తహసీల్దార్లు (డీటీలు) హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్యానల్‌ రూపకల్పనపై అభ్యంతరాలను సీసీఎల్‌ఏ ముందు లేవనెత్తేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తహసీల్దార్‌గా పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందంటూ 2017-18లో ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా నియామకమైన పలువురు డీటీలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. పదోన్నతి ద్వారా డీటీలు అయిన వారి పేర్లను సైతం పదోన్నతి ప్యానల్లో చేర్చి జాబితాలు పంపాలని జిల్లా కలెక్టర్లను కోరుతూ సీసీఎల్‌ఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. సీనియర్‌ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, ఎం.విజయకుమార్‌, న్యాయవాది తాండవ యోగేశ్‌ ఈ వ్యాజ్యంపై వాదనలు వినిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని