డయాఫ్రం వాల్‌ సామర్థ్య పరీక్షలపై భరోసా!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం పరీక్షించడం సాధ్యమేనని జాతీయ హైడ్రో పవర్‌ కంపెనీ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు తేల్చారు.

Published : 29 Jun 2022 04:44 IST

ఎన్‌హెచ్‌పీసీ నిపుణుల హామీ

సునిశితంగా పరిశీలించిన బృందం

నేడు కూడా పోలవరంలోనే..

ఈనాడు-అమరావతి, పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం పరీక్షించడం సాధ్యమేనని జాతీయ హైడ్రో పవర్‌ కంపెనీ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు తేల్చారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన ఈ వాల్‌ కొంత మేర ధ్వంసం కావడం, మరికొంత భాగం నీళ్లలో ఉండటంతో దీని సామర్థ్యం ఎలా ఉంది? దీని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కొంతకాలంగా నిపుణులు తర్జనభర్జన పడుతున్న విషయం తెలిసిందే. అసలు డయాఫ్రం వాల్‌ సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఎంతవరకు ఉందన్న చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే తీస్తా ప్రాజెక్టులో ఇలాంటి సమస్యను గుర్తించిన ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు పోలవరం పరిస్థితిని కూడా పరిశీలించాలని కేంద్ర పెద్దలు, ఏపీ జలవనరులశాఖ అధికారులు కోరారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎల్‌.కపిల్‌, మరో ఇద్దరు నిపుణులు విపుల్‌ నాగర్‌, ఎ.కె.భారతి మంగళవారం ఇక్కడకు వచ్చి డయాఫ్రం వాల్‌ మొత్తం పరిశీలించారు. ఈ వాల్‌ సామర్థ్యాన్ని మూడు, నాలుగు రకాల పరీక్షలతో నిర్ధారిస్తామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పరీక్షలు చేయాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయమై పోలవరం అధికారులకు, మేఘా ఇంజినీరింగ్‌ ప్రతినిధులకు వివరాలు ఇవ్వనున్నారు. అన్నీ సిద్ధంచేసి పిలిస్తే పరీక్షలు చేయగలమని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఏయే మార్గాల ద్వారా కాంక్రీటు సామర్థ్యాన్ని పరీక్షించవచ్చో తెలియజేశారు. వర్షం అంతరాయం కలిగించినా వారు రోజంతా పోలవరంలో పర్యటించారు. బుధవారం కూడా వారు ఇదే పనిలో ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు