ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో... కోర్టుకు హాజరైన మోహన్‌బాబు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన కేసులో సినీ నటుడు మంచు మోహన్‌బాబు, మా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌, మనోజ్‌, మరో ఇద్దరు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.

Published : 29 Jun 2022 04:44 IST

విచారణ సెప్టెంబరు 20కి వాయిదా

తిరుపతి(విద్య, లీగల్‌), న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన కేసులో సినీ నటుడు మంచు మోహన్‌బాబు, మా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌, మనోజ్‌, మరో ఇద్దరు మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండగా ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని కోరుతూ 2019 మార్చి 22న చంద్రగిరి మండలం ఏ.రంగంపేట సమీపంలోని శ్రీవిద్యానికేతన్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఎదుట విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి వారు ధర్నా చేశారు. మదనపల్లె-తిరుపతి రహదారిపై బైఠాయించి ప్రజలకు ఇబ్బంది కలిగించారని అప్పటి ఎంపీడీవో కె.హేమలత చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ మంచు మోహన్‌బాబు ఏ1గా, సీఈవోలు విష్ణువర్ధన్‌బాబు ఏ2గా, మనోజ్‌ ఏ3గా, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కె.తులసీనాయుడు ఏ4గా, పీఆర్‌వో ఆర్‌.సతీష్‌ ఏ5గా కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మంగళవారం తిరుపతి 4వ అదనపు జూనియర్‌ సివిల్స్‌ జడ్జి ఎదుట వారు హాజరయ్యారు. వారికి సమన్లు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించారు. విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేశారు.

కోర్టు ప్రాంగణానికి విద్యార్థులు
తిరుపతి కోర్టుకు మోహన్‌బాబు వస్తున్నారని తెలియడంతో టౌన్‌క్లబ్‌ కూడలి వద్దకు భారీగా విద్యార్థులు, అభిమానులు తరలి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వైకాపా నాయకులతో పాటు భాజపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చారు. గంటకు పైగా వాహనదారులతో పాటు న్యాయవాదులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. టౌన్‌ క్లబ్‌ కూడలి నుంచి మోహన్‌బాబుతో కలిసి ఆయన తనయులు నడుచుకుంటూ వచ్చి కోర్టు లోపలికి వెళ్లారు. కోర్టు బయటకు వచ్చిన మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘పాదయాత్రగా వచ్చాను. ప్రదర్శనగా వచ్చానని ఎవరు చెప్పారు. నాకున్న పాపులారిటీ ఎప్పటికీ ఉంటుంది. సమన్లు అందకపోయినా న్యాయాధిపతి రమ్మని పిలిచారు. ఆయన సమక్షంలో సమన్లపై సంతకం పెట్టా’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని