పురపాలక పాఠశాలల విలీనం ఉత్తర్వులు రద్దుచేయాలి

పురపాలక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసన

Published : 29 Jun 2022 05:20 IST

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసన

ఈనాడు, అమరావతి: పురపాలక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిరసన తెలిపారు. పాఠశాలలకు హాజరైన ఉపాధ్యాయులు ఉదయం పాఠశాల ప్రాంగణంలో ఆందోళనలు చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయుల నిరసనకు ఎమ్మెల్సీ రఘువర్మ మద్దతు తెలిపారు.  చిత్తూరు, విశాఖపట్నం జిల్లా విద్యాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. విలీన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనల్లో జిల్లాపరిషత్తు వారిని కలపకూడదని, పురపాలక పాఠశాల సముదాయాలు, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రత్యేకంగా మండల విద్యాధికారి, డిప్యూటీ విద్యాధికారి పోస్టులను ఏర్పాటు చేయాలని, పుంగనూరు పురపాలికలో అమలు చేస్తున్నట్లే జీపీఎఫ్‌ ఖాతాలు ఇవ్వాలని కోరారు. ప్రతి పట్టణ స్థానిక సంస్థ పరిధిలోనూ రెండు మహిళా జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న అన్ని సదుపాయాలను పురపాలక టీచర్లకు వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత్తు, పురపాలక ఉపాధ్యాయులకు ఒకే సర్వీసు నిబంధనలు రూపొందిస్తే..పురపాలక ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి నాయకుడు రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని