ఫ్లాట్లు వెంటనే ఖాళీ చేసేయండి.. వద్దు... మరో రెండు నెలలు ఉండండి..

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతి సదుపాయంపై ఒకే రోజు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ),

Updated : 30 Jun 2022 05:48 IST

ఉద్యోగులకు ఉచిత వసతిపై ఒకే రోజు జీఏడీ, సీఎంఓ భిన్నమైన ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న ఉచిత వసతి సదుపాయంపై ఒకే రోజు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కొద్ది గంటల వ్యవధిలోనే భిన్నమైన ఉత్తర్వులు ఇవ్వడం సంబంధిత ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురి చేసింది. ఉద్యోగులు వెంటనే తమకు కేటాయించిన ఫ్లాట్లు ఖాళీ చేసేయాలని జీఏడీ...  ఆ తర్వాత ‘వద్దు... మరో రెండు నెలలు ఉండండి’ అని సీఎంఓ ఉత్తర్వులివ్వడం గమనార్హం. ఉచిత వసతి సదుపాయాన్ని నిలిపివేస్తున్నామని, ఉద్యోగులంతా గురువారంలోగా పెట్టే బేడా సర్దుకుని ఫ్లాట్లు ఖాళీ చేసేయాలని సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని సంబంధిత ఫ్లాట్ల యజమానులకూ నోటీసు జారీ చేశారు. అంతలోనే ఉద్యోగులకు ఈ ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తున్నామని సీఎంఓ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఈ సదుపాయం పొడిగిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సాయంత్రం ఉత్తర్వులిచ్చారు.

సమన్వయలోపంతో గందరగోళం
ప్రభుత్వం ముందే ఒక నిర్ణయం తీసుకోకుండా... గడువు ముగియడానికి ఒక రోజు ముందుగా సాధారణ పరిపాలన శాఖేమో ఖాళీ చేసేయమని, ముఖ్యమంత్రి కార్యాలయం గడువు పొడిగిస్తున్నామని సమన్వయం లేకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. ఉద్యోగుల వసతికి సంబంధించి ఎప్పటికప్పుడు పొడిగిస్తున్న గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వివిధ చోట్ల ఉచిత వసతి పొందుతున్న రాష్ట్ర సచివాలయం, శాసనసభ, విభాగాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులు వారి వారి ఫ్లాట్లు ఖాళీ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. వారు నివసిస్తున్న ఫ్లాట్లను మంచి కండిషన్‌లో అప్పగించాలని స్పష్టం చేసింది. ఏమైనా పాడైతే ఆ నష్టాన్ని, విద్యుత్‌ బకాయిలు ఉంటే వాటినీ ఉద్యోగులే భరించాలని స్పష్టం చేసింది. అనంతరం సాయంత్రానికి గడువు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడటంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

ఐదు రోజుల పనిదినాలు కొనసాగింపుపై రాని స్పష్టత
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు అమలు చేస్తున్న వారానికి ఐదు రోజులు పని దినాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. దానికి ప్రభుత్వం ఇంకా పొడిగింపు ఇవ్వలేదు. ఈ విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని ఉద్యోగులు భరోసాగా ఉన్నారు. వచ్చే శనివారంలోగా ఉత్తర్వులిస్తారా? లేకపోతే ఆ రోజు పనిచేయాల్సి ఉంటుందా? అన్న సందిగ్ధత ఉద్యోగుల్లో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని