Published : 30 Jun 2022 04:08 IST

ధర గిట్టుబాటు కాకున్నా...నచ్చబట్టే మద్యం సరఫరా చేస్తున్నాం

లిక్కర్‌ అండ్‌ బీరు సరఫరాదారుల సంఘం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెల్లిస్తున్న ధర తమకు గిట్టుబాటు కాకపోయినా సరే.. తమకు నచ్చబట్టే మద్యం సరఫరా చేస్తున్నామని లిక్కర్‌ అండ్‌ బీరు సరఫరాదారుల సంఘం తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు కామేశ్వరరావు అన్నారు. కొన్ని బ్రాండ్లు అందుబాటులో లేకపోవటం ప్రభుత్వానికి, ఆయా కంపెనీల విషయమని పేర్కొన్నారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ నిర్ణయించిన ధరకు సరఫరా చేయడానికి కంపెనీలు అంగీకరించకపోవటమూ ఒక కారణమై ఉండొచ్చన్నారు. 2017 నుంచి ఇప్పటివరకూ మద్యం సరఫరా కంపెనీలకు చెల్లించే ధరల్ని పెంచలేదని, వాటిని పెంచాలని పదేపదే ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. ‘ధర గిట్టుబాటు కాకున్నా సరఫరా చేస్తున్నామంటున్నారు కదా... నష్టానికి వ్యాపారం చేస్తున్నారా? లేకుంటే నాణ్యత తగ్గిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘సరఫరా చేసే మద్యం పరిమాణం పెరిగేకొద్దీ లాభాలు వస్తాయి. నాణ్యతలో తేడా రాదు. మిశ్రమంలో కలిపే మాల్ట్‌ పరిమాణం తగ్గుతుంది’ అని వివరించారు. అంబర్‌ స్పిరిట్స్‌, పెరల్‌ డిస్టిలరీస్‌, పీఎంకే డిస్టిలరీ, ఈగల్‌ డిస్టిలరీస్‌ల ప్రతినిధులు వెంకటేశ్వరరావు, శివకుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌, సత్యనారాయణరెడ్డితో కలిసి విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ప్రభుత్వం కొన్ని కంపెనీలకే భారీగా సరఫరా ఆర్డర్లు (ఓఎఫ్‌ఎస్‌) ఇస్తోంది. వాటి బ్రాండ్లనే ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్నారు. ఇది ఆ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించటం కాదా?
వినియోగదారుడికి నచ్చకపోతే ఆ బ్రాండ్‌ను బలవంతంగా మార్కెట్‌లో పెట్టినా అమ్ముడు కాదు. అమ్ముడుకాని బ్రాండుకు ఒకసారైతే ఓఎఫ్‌ఎస్‌ ఇవ్వగలరు. పదే పదే ఇవ్వలేరు.

వినియోగదారులు కోరుకునేవి కాకుండా.. ప్రభుత్వం కావాలనుకున్న బ్రాండ్లనే దుకాణాల్లో అమ్ముతూ వాటినే తీసుకోక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. ఇది అనుకూలంగా వ్యవహరించటం కాదా?
అలాంటిదేమీ లేదు. అన్ని బ్రాండ్లూ అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఏ బ్రాండు ఎక్కువగా తాగితే అవే అమ్ముడవుతాయి. అవి సరఫరా చేసే కంపెనీలకు ఆర్డర్లు ఆ స్థాయిలోనే వస్తాయి.

గతంలో బాగా అమ్ముడైన బ్రాండ్లు ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభిస్తున్నాయా? ఇప్పుడే వెళ్లి చూద్దామా? అక్కడే వాస్తవం ఏమిటో తేలిపోతుంది కదా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనం వహించారు.

అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ సరఫరా చేసే సుప్రీమ్‌ బ్లెండ్‌ సుపీరియర్‌ గ్రెయిన్‌ విస్కీ బ్రాండ్‌ ప్రవేశపెట్టిన నెలకే అత్యధికంగా ఎలా అమ్ముడైంది? దానికి అనుచిత లబ్ధి చేకూర్చలేదా?
అది బ్రాండ్‌ను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉండొచ్చు. మీరు చెబుతున్న బ్రాండు బాగుండి ఉండొచ్చు.

కొన్ని మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాలు ఉన్నాయంటూ తెదేపా ఎస్‌జీఎస్‌ ల్యాబ్‌ నివేదికను విడుదల చేసిన మర్నాటినుంచే ఆ బ్రాండ్ల అమ్మకాల్ని ఎందుకు నిలిపేశారు? లోపాలు బయటపడతాయనేనా?
మా దురదృష్టం ఏమిటంటే గత అయిదు రోజులుగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యల వల్ల డిస్టిలరీల్లో మద్యం బాటిళ్ల స్కానింగ్‌ సరిగ్గా జరగట్లేదు. స్కానింగ్‌ అయితే కానీ వాటిని మేము డిపోలకు పంపించలేము. అవి డిపోల నుంచి రిటైల్‌ దుకాణాలకు వెళ్లాలన్నా అక్కడా స్కానింగ్‌ చేయాల్సిందే. ఈ సమస్యల వల్లే ఆ బ్రాండ్లు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. 

విష రసాయనాలు లేవు
‘కొన్ని మద్యం బ్రాండ్లలో విషపూరిత రసాయనాలు ఉన్నాయంటూ ఎస్‌జీఎస్‌ పేరిట విడుదల చేసిన నివేదిక సరైనది కాదు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ ప్రమాణాల ప్రకారం తాము పరీక్షలు చేయలేదని ఎస్‌జీఎస్‌ ల్యాబే చెప్పింది. డీఆర్‌డీఏ ప్రయోగశాలల్లో మేం పరీక్షలు చేయిస్తున్నాం. మూడురోజుల్లో వాటి ఫలితాలు వస్తాయి. మీడియాకు విడుదల చేస్తాం. ఇంకా అపోహలు ఉంటే మా డిస్టిలరీల్లోకి వచ్చి ఎప్పుడైనా నాణ్యత పరిశీలించుకోవచ్చు’ అని కామేశ్వరరావు చెప్పారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో మద్యం సరఫరాదారులకు చెల్లించే ధర తక్కువని, దీన్ని పెంచాలని తాము కోరుతున్నామని అన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని