Published : 30 Jun 2022 04:08 IST

డయాఫ్రం వాల్‌ పరీక్షకు దొరికిందో పరిష్కారం

ఏమేం ఏర్పాట్లు చేయాలో చెప్పిన ఎన్‌హెచ్‌పీసీ

అన్నీ సిద్ధం చేసి పిలిస్తే వస్తామని వెల్లడి

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యాన్ని తేల్చేందుకు ఎట్టకేలకు ఓ దారి దొరికింది. నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు దీనికి మార్గం చూపారు. దాదాపు ఏడాది కాలంగా డయాఫ్రం వాల్‌ (నీటి ఊట నియంత్రణ గోడ) పెనుసవాల్‌గా మారింది. రెండు భారీ వరదల తర్వాత కొంత మేర వాల్‌ ధ్వంసం కావడంతో అసలు దాని పరిస్థితి ఎలా ఉందో తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు అవకాశమే లేదని, కొత్తది నిర్మించుకోవడమే పరిష్కారమన్న చర్చ కూడా సాగింది. చివరికి దేశీయంగానే పరీక్షకు సంబంధించిన పరిజ్ఞానం అందుబాటులో ఉందని తేలింది. తీస్తా విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో ఇలాంటి సమస్యను పరిష్కరించిన క్రమంలో పోలవరం డయాఫ్రం వాల్‌ ఎలా ఉందో తేల్చవచ్చనే ఆలోచన మొగ్గ తొడిగింది.

విద్యుత్తు ప్రవాహం పంపి..
ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ విధానంలో డయాఫ్రం వాల్‌ పరిస్థితి ఎలా ఉందో తేల్చనున్నారు. ఇందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందని ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ఈ ప్రాజెక్టు అధికారులకు తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎల్‌.కపిల్‌ ఈ విధానం గురించి జలవనరులశాఖ అధికారులకు వివరించారు. ఈ పరీక్షలు ఎలా జరుపుతారు? అందుకు ఎలాంటి ఏర్పాట్లు అవసరం? ఆ పరీక్షల తర్వాత కట్టడం సామర్థ్యాన్ని ఏ రకంగా అంచనా వేయవచ్చో వివరించారు. డయాఫ్రం వాల్‌ పొడవునా ఎలక్ట్రోడ్లు ఏర్పాటు చేసి వాటి గుండా విద్యుత్తు ప్రవహింపజేసి అది ఎక్కడి వరకు ఎలా ప్రవహిస్తోంది? ఎక్కడ ప్రతికూలత ఉందో గుర్తించి.. ఆ ప్రాంతంలో కాంక్రీటు ఎలా ఉందో అంచనావేసి వాల్‌ సామర్థ్యాన్ని తేల్చనున్నారు.

1.38 కిలోమీటర్ల పొడవు వాల్‌
గోదావరి నదీ గర్భంలో దాదాపు 1.38 కిలోమీటర్ల పొడవునా డయాఫ్రం వాల్‌ నిర్మించారు. కొన్నిచోట్ల 90 అడుగుల లోతు నుంచి మరి కొన్నిచోట్ల 300 అడుగుల లోతు నుంచి కూడా ఈ నీటి ఊట నియంత్రణ గోడ నిర్మించుకుంటూ వచ్చారు. ఇసుక కోతతో ధ్వంసమైన ప్రాంతంలో దాదాపు 600 మీటర్లు, కోత పడని ప్రాంతంలో మరో 800 మీటర్ల మేర డయాఫ్రం వాల్‌ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇదీ పరీక్ష విధానం..
* ఈ వాల్‌ పొడవునా ప్రతి ఒక మీటరుకు 20 మిల్లీమీటర్ల మేర రంధ్రం చేస్తారు. ప్రతి 40 మీటర్లను ఒక ప్యానెల్‌గా గుర్తిస్తారు. ఇలా వాల్‌ పొడవునా రంధ్రాలు చేసి వాటిలోకి ఎలక్ట్రోడ్లు పంపిస్తారు. దాదాపు 30 మీటర్ల లోతు వరకు ఇలా పంపాలని యోచిస్తున్నారు.

* వాల్‌ వెడల్పును పరిగణనలోకి తీసుకున్నప్పుడు మధ్య నుంచి అటు 0.6 మీటర్లకు.. ఇటు 0.6 మీటర్లకు ఒక రంధ్రం చేస్తారు. వీటిలోనూ ఎలక్ట్రోడ్లు ఏర్పాటు చేస్తారు.

* వాల్‌కు అటూ ఇటూ కూడా జిగ్‌జాగ్‌ పద్ధతిలో రంధ్రాలు చేసి వాటిలో చిన్నపాటి పేలుళ్లు నిర్వహిస్తారు.
ఈ మేరకు పోలవరం అధికారులు, గుత్తేదారు ఏర్పాటు చేసి పిలిస్తే ఎన్‌హెచ్‌పీసీ అధికారులు వచ్చి అక్కడ అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు.

ఏర్పాట్లకే నెలన్నర సమయం..
డయాఫ్రం వాల్‌ పొడవునా వారు సూచించిన విధానంలో దాదాపు 2,400 రంధ్రాలు, అవసరమైన చోట ఎలక్ట్రోడ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎలా చేయాలో ఎన్‌హెచ్‌పీసీ అధికారులు ఒక సమగ్ర నోట్‌ తయారు చేసి ఇస్తామని చెప్పారు. డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో ఇప్పటికీ 13 నుంచి 14 మీటర్ల మేర నీరు నిలిచి ఉంది. అక్కడ రంధ్రాలు చేయడానికి అధికారులు తగిన కార్యాచరణ సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేసరికి దాదాపు నెలన్నర రోజుల సమయం పట్టవచ్చని అంచనాకు వచ్చారు. పరీక్షల అనంతరం ఎన్‌హెచ్‌పీసీ ఇచ్చే నివేదిక ద్వారా ఈ వాల్‌ సామర్థ్యం తేలుతుంది. ధ్వంసమైన ప్రాంతంలో ఆ కొద్దిమేర సమాంతరంగా మరో వాల్‌ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు.


పోలవరంలో రెండోరోజూ ఎన్‌హెచ్‌పీసీ నిపుణుల పర్యటన

జాతీయ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ కంపెనీ (ఎన్‌హెచ్‌పీసీ) నిపుణుల పోలవరం పర్యటన రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది. జల విద్యుత్‌ కేంద్రం వద్ద జరుగుతున్న పనులతో పాటు గ్యాప్‌-1, దిగువ కాఫర్‌డ్యాం నిర్మాణ పనులను ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎల్‌.కపిల్‌, మరో ఇద్దరు నిపుణులు విపుల్‌ నాగర్‌ ఎ.కె.భారతి పరిశీలించారు. దిగువ కాఫర్‌డ్యాం వద్ద జరుగుతున్న వైబ్రో కాంప్షన్‌ పనుల వివరాలను తెలుసుకున్నారు. జల విద్యుత్తు కేంద్రం వద్ద జరుగుతున్న పనులు, సొరంగాలను తిలకించారు. డయాఫ్రంవాల్‌ గురించి చర్చించారు. పీపీఏ డిప్యూటీ డైరెక్టర్‌ సందీప్‌, ప్రాజెక్టు సీఈ సుధాకరబాబు, సలహాదారు గిరిధరరెడ్డి, ఎస్‌ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లికార్జునరావు, పాండురంగయ్య, డీఈలు శ్రీనివాస్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

- పోలవరం, న్యూస్‌టుడే


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని