Updated : 30 Jun 2022 09:21 IST

Raghurama: రఘురామను హైదరాబాద్‌లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం

ప్రక్రియ మొత్తం వీడియో తీయాలి

అభియోగపత్రం దాఖలు చేయడానికి వీల్లేదు

ఈనాడు, అమరావతి: రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల విషయంలో ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లోని దిల్‌ కుషా ప్రభుత్వ అతిథి గృహంలో విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతిచ్చింది. ఇదే కేసులో ఇతర నిందితులైన ఏబీఎన్‌, టీవీ-5లతో కలిపి ఎంపీని విచారించాలని భావిస్తే 15 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని పేర్కొంది. ఆయన ఎంచుకున్న న్యాయవాది సమక్షంలోనే విచారించాలని, ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశించింది. ఎంపీకి వై-కేటగిరీ భద్రత ఉన్న నేపథ్యంలో విచారణ గది బయట సెక్యూరిటీ సిబ్బందిని అనుమతించాలని, కేసు విషయాలపై మినహా ఇతర అంశాలను ప్రశ్నించడానికి వీల్లేదని సీఐడీకి తేల్చిచెప్పింది. పిటిషనర్‌ హృద్రోగి అయిన నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించినందున, ఈ కేసులో దర్యాప్తు పూర్తయినప్పటికీ సంబంధిత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయవద్దని స్పష్టంచేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వ్యాజ్యంపై విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. ఏపీ సీఐడీ తనపై సుమోటోగా తీసుకుని రాజద్రోహం(ఐపీసీ సెక్షన్‌ 124ఏ), రెండు సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం (153 ఏ), 505, 120బి సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి... భద్రతపై ఎంపీ ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా విచారణ సాధ్యమా? కానిపక్షంలో ఏదైనా సురక్షిత ప్రదేశాన్ని సూచించాలని సీఐడీని ఆదేశించారు.

* బుధవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ... ఆన్‌లైన్‌ విచారణ దర్యాప్తు ప్రక్రియను దెబ్బతీస్తుందన్నారు. ఇతర ప్రాంతానికెళ్లి విచారించడం ఖర్చుతో కూడుకొందన్నారు. సీఐడీ కార్యాలయంలో విచారణకు అనుమతించాలన్నారు. ఎంపీ తరఫు న్యాయవాది స్పందిస్తూ... హోటల్‌లో విచారణకు అభ్యంతరం లేదన్నారు. ఆ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చుతూ.. ప్రైవేటు స్థలంలో విచారణ సాధ్యపడదన్నారు. ఎంపీ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రాజద్రోహం అమలును సుప్రీంకోర్టు నిలుపుదల చేసిందన్నారు. పిటిషనర్‌ విషయంలో సీఐడీ నమోదు చేసిన ఇతర సెక్షన్లు వర్తించవన్నారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవన్నారు. ప్రభుత్వం ఓ కులానికి, మతానికి మాత్రమే మేలు చేస్తోందని విమర్శించారన్నారు. అందుకే ఇతర సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ... రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల విషయంలో విచారణ కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఇరువురికీ ఆమోదమైన స్థలాన్ని సూచించాలని విచారణను మధ్యాహ్నం 2.30కి వాయిదా వేశారు. అనంతరం జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది.. హైదరాబాద్‌లోని దిల్‌ కుషా అతిథిగృహం లేదా మసాబ్‌ ట్యాంక్‌ పోలీసు మెస్‌లో విచారించేందుకు సిద్ధమన్నారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ... వాస్తవాలను రాబట్టాలంటే పిటిషనర్‌తోపాటు ఇతర నిందితులైన ఏబీఎన్‌, టీవీ-5 నేరుగా విచారించాలని సీఐడీ చెబుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన సురక్షిత ప్రాంతంలో విచారణ జరగాలని ప్రస్తుత ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని