Published : 30 Jun 2022 05:15 IST

కోర్టు ఆదేశాల ఉల్లంఘనే

ఉద్యోగుల ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణపై హైకోర్టు స్పందన

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయామని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణ.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని తేల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టుధిక్కరణ నోటీసులిస్తామని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై సీఎస్‌ సమాధానం చెప్పాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్‌తో పాటు ఏ ప్రభుత్వ ఉద్యోగి సొమ్మునూ ఉపసంహరించొద్దని/ రికవరీ చేయవద్దని గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చామని గుర్తుచేసింది. ఉద్యోగులకు తెలియకుండా నగదు ఎలా ఉపసంహరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఖాతా నుంచి ఎంత సొమ్ము ఉపసంహరించారు, తదితర వివరాలతో అఫిడవిట్‌ వేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. దానిని పరిశీలించి సీఎస్‌తో పాటు సంబంధిత అధికారులకు కోర్టుధిక్కరణ నోటీసులిస్తామని తేల్చిచెప్పింది. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ.. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించలేదన్నారు. పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. దీంతో విచారణను జులై 12కి వాయిదా వేసిన ధర్మాసనం.. వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. ఏ ఉద్యోగి సొమ్మును రికవరీ చేయవద్దని, అలా చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

తెలియకుండా ఉపసంహరిస్తే సైబర్‌ నేరమే
బుధవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.రవితేజ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. పిటిషనర్‌ జీపీఎఫ్‌ ఖాతా నుంచి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రూ.91 వేలను ఉపసంహరించిందన్నారు. పిటిషనర్‌కు తెలియకుండా ఖాతా నుంచి సొమ్ము ఉపసంహరించడం సైబర్‌ నేరం కిందికి వస్తుందన్నారు. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రభుత్వం చాలా జీవోలిచ్చినా, వాటిని బహిర్గతం చేయడం లేదన్నారు. పీఆర్సీ అమలు చేశాక జీతం ఎంత వస్తోంది, ఎంత కోతపెడుతున్నారు, పదవీ విరమణ తర్వాత కలిగే ప్రయోజనాలేంటి తదితర వివరాలను పిటిషనర్‌ తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఓ విధంగా చెప్పాలంటే బానిసలా పనిచేస్తున్నారన్నారు. ఏ ఉద్యోగికైనా ఎంత జీతం వస్తోంది, ఎంత కోత పడుతుందనే వివరాలు తెలుసుకునే హక్కు ఉంటుందని, వివరాలను అందుబాటులో ఉంచకపోవడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలు దురదృష్టకరమంది. నగదు ఉపసంహరణ విషయంలో ప్రభుత్వ చర్యలపై కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేయాలని పిటిషనర్‌కు సూచించింది.

* రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. న్యాయస్థానం ఆదేశిస్తే పిటిషనర్‌ జీతభత్యాలు, ప్రభుత్వం ఇచ్చిన జీవోల వివరాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. ఎంత సొమ్ము ఖాతా నుంచి ఉపసంహరించారు, తదితర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని