జలవనరుల శాఖలో బది‘లీలలు’!

జలవనరుల శాఖలో ప్రస్తుత బదిలీలే నేపథ్యంగా కొందరు జూనియర్లు అందలం ఎక్కేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరు అధికారులు, ఉద్యోగులు ఉన్న స్థానాల్లోనే

Published : 30 Jun 2022 05:15 IST

ఇంజినీరింగు పోస్టులో లేని ఇంజినీరుదే చక్రం

ఈనాడు, అమరావతి: జలవనరుల శాఖలో ప్రస్తుత బదిలీలే నేపథ్యంగా కొందరు జూనియర్లు అందలం ఎక్కేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరు అధికారులు, ఉద్యోగులు ఉన్న స్థానాల్లోనే కొనసాగేందుకు ముఖ్యులను ప్రసన్నం చేసుకుంటున్నారు. అనేక పోస్టులకు బదిలీల కోసం ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి లేఖలతో ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అదనంగా ప్రస్తుతం ఉన్న బదిలీల అవకాశాలను అందిపుచ్చుకుని కీలక పోస్టులు పొందే ప్రయత్నాలు సాగుతున్నాయి. గురువారంతో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల జలవనరుల శాఖలో డిప్యూటీ ఇంజినీర్ల స్థాయి నుంచి చీఫ్‌ ఇంజినీరు వరకు పదోన్నతుల ప్రక్రియ ఎప్పటి నుంచో నిలిచిపోయింది. ఫలితంగా అనేక కీలక స్థానాల్లో పూర్తి అదనపు బాధ్యతలతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఒకే ఇంజినీరు రెండు మూడు బాధ్యతలు...అదీ వేర్వేరు జిల్లాల్లో నిర్వహిస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించేందుకు సీనియారిటీ ప్రాతిపదిక కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పాలనా సౌలభ్యం అన్న ఒకే ఒక వెసులుబాటు బదిలీల ప్రక్రియను ఉపయోగించుకునే వారికి ఎంతో ఉపయోగపడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ (పాలన), ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ (నీటిపారుదల) ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా అదే పోస్టుల్లో ఉంటున్నా వారిని కదిలించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఉండటం వల్ల దక్కే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల స్థానంలో ఉన్న వారికి బదిలీల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఈ వెసులుబాటును ఉపయోగించుకుంటూ కొందరు అవే స్థానాల్లో కొనసాగే ప్రయత్నాలు చేస్తున్నారు.

అదనపు బాధ్యతల కోసం ఉవ్విళ్లు...
జలవనరుల శాఖలో ప్రస్తుతం బదిలీలకు సంబంధించి ఒక వ్యక్తి చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఇంజినీరింగు అధికారిగా పనిచేసి ప్రస్తుతం ఆ హోదాతో సంబంధం లేని పోస్టులో ఆయన ఉన్నారు. రాజధానిలో ఓ కీలకమైన కార్యాలయంలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల బదిలీ కావాలని కోరుకునే వారు ఆయన ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం. డీఈఈ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, ఎస్‌ఈ స్థాయి పోస్టుల్లో పూర్తి అదనపు బాధ్యతలు తీసుకునేందుకు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. తమకు ఇష్టులైన వారిని ఆయా కీలక స్థానాల్లో కూర్చోబెట్టేందుకు కొందరు జలవనరులశాఖలో ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని