Published : 30 Jun 2022 05:15 IST

సంక్షిప్త వార్తలు

1న బీఎస్‌ఎన్‌ఎల్‌లో అప్రెంటీస్‌ల నియామకం

చుట్టుగుంట (విజయవాడ), న్యూస్‌టుడే: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) రాష్ట్ర సర్కిల్‌లో జులై ఒకటో తేదీన అప్రెంటీస్‌ల నియామకం చేపడుతున్నట్లు డీజీఎం (హెచ్‌ఆర్‌) జి.అర్జున్‌సింగ్‌ తెలిపారు. అప్రెంటీస్‌షిప్‌ ట్రైనింగ్‌ బోర్డు (బోట్‌) ఆధ్వర్యంలో ఆ రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తిరుపతిలోని ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఈసీఈ విభాగం నుంచి డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన 58 మందిని ఎంపిక చేస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చని ఆయన సూచించారు.


జులై నెలాఖరు వరకూ అందని పాఠ్యపుస్తకాలు

ఈనాడు, అమరావతి: సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారుల నిర్ణయం కారణంగా విద్యార్థులకు జులై నెలాఖరు వరకూ పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి కనిపించట్లేదు. జులై 5న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా 30 వరకూ పాఠ్యపుస్తకాల కోసం ఎదురు చూడాల్సిందే. విద్యాకానుక కిట్లను జులై 30వ తేదీ వరకు పంపిణీ చేసేలా ఉన్నతాధికారి ఆదేశాలు ఇచ్చారు. విద్యాకానుక కిట్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మూడు జతల ఏకరూప దుస్తులు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్‌, నిఘంటువులు ఇస్తారు. ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు, ఒకటో తరగతికి ఇచ్చే నిఘంటువుల సరఫరా 50% లోపే ఉంది. దీంతో విద్యాకానుక పంపిణీ 26 రోజులపాటు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. రోజుకు 30 నుంచి 40కిట్లు మాత్రమే ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు కిట్‌ అందితేనే పాఠ్యపుస్తకాలు వస్తాయి. ఉన్నతాధికారి ఆదేశాల కారణంగా ఈ నెల చివరివరకూ కొందరికి పాఠ్య, నోటు పుస్తకాలు అందవు. కొత్తగా ప్రవేశాలు పొందినవారి వివరాలను జులై 15లోపు అందించాలని, వీరికి సెప్టెంబరు 15లోపు విద్యాకానుక అందిస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, ‘నాడు-నేడు’, విద్యాకానుక కోసం జూన్‌లో తెరవాల్సిన బడులను జులైకి వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45.80 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుకలను అందించాల్సి ఉంది.


పాత్రికేయులపై వృత్తి పన్ను భారం వేయొద్దు

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పాత్రికేయులపై వృత్తి పన్ను భారం వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకట్రావు, ఆంజనేయులు కోరారు. విజయవాడలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డిని కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డుల పునరుద్ధరణ, ప్రమాదబీమా, చిన్న పత్రికలకు జీఎస్టీ తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన కమిషనర్‌ వృత్తి పన్ను విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చిస్తామని, త్వరలోనే హెల్త్‌కార్డుల పునరుద్ధరణకు జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.


ఆప్కో ద్వారా రూ.100 కోట్ల విక్రయాలు లక్ష్యం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆప్కో ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్ల విక్రయాలు లక్ష్యంగా వార్షిక కార్యచరణ సిద్ధం చేయాలని అధికారుల్ని చేనేత, జౌళిశాఖ ముఖ్యకార్యదర్శి సునీత ఆదేశించారు. విజయవాడలో ఆమె బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రస్తుతమున్న రూ.30 కోట్ల విక్రయాలను రూ.100 కోట్లకు పెంచాలి. అమ్మకాల బాధ్యతను డివిజినల్‌ మార్కెటింగ్‌ అధికారులకు అప్పగించి జిల్లా స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విక్రయ ఒప్పందాలు సాధించేలా చర్యలు తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఆప్కో ఛైర్మన్‌ మోహన్‌రావు పాల్గొన్నారు.


అశోక్‌గజపతిరాజుకు కరోనా

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుకు కరోనా సోకింది. మంగళవారం కుమార్తె అదితి గజపతిరాజుకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. బుధవారం ఆయన కూడా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. రెండు రోజులుగా తనను కలిసిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానం ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని అశోక్‌గజపతిరాజు ఒక ప్రకటనలో తెలిపారు.


6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు బుధవారం సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి ఆరు గంటల్లోనే దర్శనం లభిస్తోంది. మంగళవారం 77,154 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.4.62 కోట్ల హుండీ కానుకలు లభించాయి.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని