డీజిల్‌ ధర తగ్గింది... ఆర్టీసీ సెస్‌ పెంచింది!

సాధారణంగా డీజిల్‌ ధరలు పెరుగుతుంటే ఛార్జీలు పెంచుతుంటారు. ఆర్టీసీ మాత్రం రెండు నెలల కిందటి కంటే ప్రస్తుతం తక్కువ ధరకు డీజిల్‌ కొంటున్నా... మరోసారి టికెట్ల ధరలు

Published : 01 Jul 2022 04:24 IST

ఏప్రిల్‌లో లీటర్‌కు రూ.107

ప్రస్తుతం లీటర్‌ రూ.97-99

ఈనాడు, అమరావతి: సాధారణంగా డీజిల్‌ ధరలు పెరుగుతుంటే ఛార్జీలు పెంచుతుంటారు. ఆర్టీసీ మాత్రం రెండు నెలల కిందటి కంటే ప్రస్తుతం తక్కువ ధరకు డీజిల్‌ కొంటున్నా... మరోసారి టికెట్ల ధరలు పెంచింది. గతంలోకంటే డీజిల్‌ ధరల భారం పెరగడంతోనే ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో 2019 డిసెంబరు 11 నాటికి డీజిల్‌ ధర లీటర్‌కు రూ.67 ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 13కి రూ.107కి చేరిందన్నారు. ఒక లీటర్‌పై రూ.40 చొప్పున పెరగడంతో తొలుత ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ విధించామన్నారు. ప్రస్తుతం డీజిల్‌ బల్క్‌ ధర రూ.131కి చేరడంతో సంస్థపై నిత్యం రూ.2.50 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. అందుకే మరోసారి డీజిల్‌ సెస్‌ పెంచక తప్పడంలేదని ప్రకటనలో పేర్కొన్నారు. కానీ... వాస్తవం మరోలా ఉంది.

రిటైల్‌లో కొనుగోలుతో తగ్గిన భారం: చమురు సంస్థల నుంచి తీసుకునే బల్క్‌ డీజిల్‌ ధర కంటే, రిటైల్‌ బంకుల్లో తీసుకునే ధర తక్కువగా ఉంది. దాంతో ఆర్టీసీ ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి రిటైల్‌ బంకుల్లోనే డీజిల్‌ను కొంటోంది. ఏప్రిల్‌లో బల్క్‌ ధర లీటర్‌కు రూ.107 ఉందని, ప్రస్తుతం రూ.131కి చేరిందని అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి రిటైల్‌ బంకుల్లో ధర రాష్ట్రంలోని ఆయా జిల్లాలను బట్టి లీటర్‌కు రూ.97-99 మధ్య ఉంది. అంటే గతం కంటే ఆర్టీసీపై కొంత భారం తగ్గింది. అయినప్పటికీ అదనపు భారమంటూ మరోసారి డీజిల్‌ సెస్‌ విధించారు. దీనిపై ఆర్టీసీ అధికారుల వాదన మరోలా ఉంది. ఏప్రిల్‌లో దూర ప్రాంత సర్వీసుల్లో ఎంత దూరమైనప్పటికీ రూ.10-20 చొప్పునే పెంచారు. దీనివల్ల ఆయా సర్వీసుల్లో నష్టం వస్తోందని, అందుకే వాటిలో ఛార్జీలు పెంచాల్సి ఉండటంతో.. అన్ని సర్వీసులకు కలిపి రెండోసారి డీజిల్‌ సెస్‌ విధించినట్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని